Monday, December 23, 2024

డ్యూయీని యాజ్జేసుకుందాం

- Advertisement -
- Advertisement -

Prof. Dewey said.. Every society gets encumbered with what is trivial, with dead wood from the past, and with what is positively perverse. As a society becomes more enlightened, it realises that it is responsible not to conserve and transmit the whole of its existing achievements, but only such as to make for a better future society. The school is its chief agency for the accomplishment of this end Dr. B.R.Ambedkar
ఇవాళ ప్రఖ్యాత విద్యావేత్త జాన్ డ్యూయీ జన్మదినం. పంతుళ్లం, పిల్లలు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు, పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్కరం డ్యూయీ మహానుభావునికి నివాళి ఘటించి స్మరించుకోవాల్సిన శుభదినమిది. ఎందుకంటే ‘విద్య- సమాజం- ప్రగతిశీలం- ప్రజాస్వామ్యం’ అనే నాలుగు మాటలు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా యావత్ ప్రపంచానికి తక్షణం స్ఫురించే పేరు జాన్ డ్యూయీ.

కాలం: 20 అక్టోబర్ -1859 -1- జున్ -1952. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఈయన ఇరవయ్యో శతాబ్దపు మేధావుల్లో అగ్రగణ్యుడు. తాత్త్విక రంగంలోనూ, మనోవిజ్ఞాన రంగంలోనూ జాన్ డ్యూయీ చేసిన కృషి అపారమైంది. డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు గురువుగా కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా పరోక్షంగా భారత రాజ్యాంగ రచనకు డ్యూయీ ఇచ్చిన పరోక్ష ప్రేరణ ఎంతో శ్లాఘనీయం. అభ్యసన కృత్యాల్లో ‘లెర్నింగ్ బై డూయింగ్’ అనే విధానానికున్న ప్రాముఖ్యతను చాటిచెప్పిన అభ్యసన సంస్కర్త. వ్యవహారికసత్తా వాదాని (ప్రాగ్మాటిజం)కి మరింత ప్రాచూర్యం కల్పించిన యుక్తిపరుడు. ‘ది మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఎక్స్ పీరియన్షియల్ ఎడ్యుకేషన్’ గా పేరుగాంచిన బోధనా నిపుణుడు. చర్య, అనువర్తనానికి ఆచరణాత్మక ప్రాధాన్యతనిస్తూ మనోవిజ్ఞాన శాస్త్రంలో ‘ఫంక్షనల్ సైకాలజీ’ అనే కొత్త శాఖకు పురుడుపోసిన డ్యూయీ ‘ద లేబొరేటరీ స్కూల్’ ద్యారా విద్యాభివృద్ధికి ఎన్నో ప్రయోగాలు చేశారు.

ముఖ్యంగా సంక్లిష్టమయ- జీవితంతోనూ, అభ్యసనంతోనూ, ప్రపంచంతోనూ జాన్ డ్యూయీ సిద్ధాంతాలు మానవాళి ఎదుగుదల సురక్షితం కోసమై నిత్యం తలపడతాయి. సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, చరిత్రకారులు, సామాజిక విమర్శకుడు నోమ్ ఛామ్స్కీ ప్రకారం విద్య రెండు రకాలు. 1. జ్ఞానోదయ సంబంధి (Enlightenment), 2.శిక్షణా సంబంధి(Indoctrination). మొదటిది మానవ చైతన్యాన్ని, రెండోది వృత్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. ఈ ఉభయ విద్యలను బోధించాల్సిన పాఠశాల, అందిపుచ్చుకోవాల్సిన సమాజం ఎట్లా పరస్పర ఆధారితాలో నూటా ఇరవై ఐదేండ్ల క్రితమే పరిశోధనాత్మకంగా చర్చకు పెట్టిన ప్రతిభావంతుడు జాన్ డ్యూయీ. వ్యక్తిగత బోధన, సమస్య ఆధారిత, సమీకృత అభ్యాసం, డైలాజిక్ టీచింగ్, క్రిటికల్ ఎంక్వయిరీతో సహా ఇవాళ్టి ఆధునిక బోధనా పద్ధతులపై డ్యూయీ ప్రభావం అమితంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా తన కాలంలోనే కాదు తన అనంతరం కూడా పిల్లల చదువులను సమూలంగా మార్చాయన్నది యధార్థం.

ప్రగతిశీల విద్య (ప్రొగ్రెస్సివ్ ఎడ్యుకేషన్)కు ఉద్యమాచరణను జోడించిన డ్యూయీ విద్య అనేది వాస్తవాలు, నియమాల నిష్క్రియాత్మక ప్రసారంగా కాకుండా చురుకైన విచారణ, సమస్యల పరిష్కార ప్రక్రియగా ఉండాలని ఆయన గాఢంగా నమ్మాడు. విద్య విద్యార్థులను పౌరులుగా ఎదిగించి ప్రజాస్వామ్యం సమాజంలో పరిపూర్ణంగా జీవించేందుకు సిద్ధం చేయాలని, విద్యలో సామాజిక మార్పుకు అవసరమైన ఆవిష్కరణలలో యువత భాగస్వామ్యం తీసుకోవాలని ఆశించాడు. తత్త్వశాస్త్ర పరిధిని అన్వయిస్తూ విద్య ప్రధానంగా ‘ప్రయోజనం (Utility), ఆసక్తి (Interest), అనుభవం (Experience), ఏకీకరణ (Integra tion)’ అనే నాలుగు సూత్రాలపై ఆధారపడి వర్ధిల్లగలదని వాదించాడు. ఎథిక్స్, ఎపిస్టమాలజీ, లాజిక్, మెటాఫిజిక్స్, సౌందర్యశాస్త్రం,మత తాత్వికతలకు సామాజిక కోణం జోడించి ఇరవై ఒకటో శతాబ్దానికి సైతం అవసరమైనంతగా అభివృద్ధి పరచాడు. ప్రసిద్ధ మిచిగాన్, మిన్నెసోటా, చికాగో, కొలంబియా వంటి విశ్వవిద్యాలయాల్లో బోధకుడుగా పని చేసిన జాన్ డ్యూయీ అత్యంత ప్రతిభావంతుడైన రచయిత కూడా.

తన అరవై ఐదు సంవత్సరాల రచనా కాలంలో విద్య, కళలు, ప్రకృతి, తత్వశాస్త్రం, మతం, సంస్కృతి, నైతికత, ప్రజాస్వామ్యంతో సహా పలు విషయాలపై నూటా నలభై జర్నల్స్‌లో ఏడు వందలకు పైబడిన పరిశోధక వ్యాసాలు ప్రచురించారు. ఈయన ముద్రత గ్రంథాలు నలభై దాకా ఉన్నాయి. దేనికదే విశిష్టమైంది. ‘ది స్కూల్ అండ్ సొసైటీ’, ‘ది చైల్డ్ అండ్ ది కరికులం’, ‘హౌ వుయ్ థింక్’, ఎక్స్‌పీరియన్స్ అండ్ నెచర్’, ‘ఫిలాసఫీ అండ్ సివిలైజేషన్’, ‘నోయింగ్ అండ్ నౌన్’, ‘హ్యూమన్ నేచర్ అండ్ కండక్ట్’, ‘ది పబ్లిక్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్’, ‘ది క్వెస్ట్ ఫర్ సర్టెనిటీ’ తదితర రచనలు డ్యూయీ ఆలోచనాధారకు, భావుకతకు ప్రతిరూపాలు. సోక్రటీసు మహానుభావుడు చెప్పినట్టు సాధారణ జ్ఞానం (Ordinary Knowledge), ఉన్నతమైన జ్ఞానం (Higher Knowledge) ఈ రెండిటిలో- సమాచారాన్ని తెలిసివుండటమనే సాధారణ జ్ఞానం కంటే, మేధస్సును విస్తరించే ఉన్నతమైన జ్ఞానమే మానవాభివృద్ధికి సమాజ ప్రగతికి ఆలంబన కాగలదని, కొత్త తరాలకు స్ఫూర్తినివ్వగలదని డ్యూయీ ‘డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ’ పుస్తకం మనకు వివరిస్తుంది.

‘ఆర్ట్ యాస్ ఎక్స్‌పీరియన్స్’ గ్రంథంలో లలితకళలను మానవ సంస్కృతి నాగరికతలకు సంబంధించిన అభివ్యక్తీకరణ వస్తువులు (ఎక్స్‌ప్రెస్సివ్ ఆబ్జెక్ట్)గా, సృజనాత్మక మదింపులు గా పేర్కొనడం ఆయన కళాతత్త్వ పాండిత్యానికి నిదర్శనం. ద న్యూ రిపబ్లిక్, ద నేషన్ వంటి ప్రముఖ పత్రికలకు డ్యూయీ అదించిన రచనలు మహిళల ఓటు హక్కు, ఉపాధ్యాయుల సంఘాలు వంటి వివిధ విషయాలపై ఆయన రాజకీయ పరిపక్వతకు సూచికలు. పాఠశాల కేవలం విద్యాభివృద్ధినే లక్ష్యం చేసుకోదు, పిల్లల సమగ్ర సామాజిక, భావోద్వేగ, భౌతిక, కెరీర్ అభివృద్ధి కేంద్రంగా కూడా పని చేయాల్సి ఉంటుంది.

దీనినే డ్యూయీ ఇట్లా ‘We are apt to look at the school from an individualistic standpoint, as something between teacher and pupil, or between teacher and parent. That which interests us most is naturally the progress made by the individual child of our acquaintance, his normal physical develop ment, his advance in the ability to read, write, and figure, his growth in the knowledge of geography and history, improvement in manners, habits of promptness, order, and industry- it is from such standards as these that we judge the work of the school’ విశదీకరించాడు. బయటి దేశస్థులకు అమెరికా ప్రజాస్వామ్యం గొప్పగా కనిపిస్తుంటది. అయితే, దేశాన్ని పరిపాలించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, నిపుణులు, రాజకీయ నాయకులది మాత్రమే కాదు. ప్రభుత్వం కేవలం ప్రజల కోసం కాకుండా ప్రజల ద్వారా ఉద్భవించేలా అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించాలని డ్యూయీ విమర్శించారు.

మరింత ప్రజాస్వామ్యయుతమైన సమాజం రూపొందడమే ప్రజాస్వామ్య అంతిమ లక్ష్యం అంటూ ఔచితీవంతమైన ప్రజాస్వామ్య సమాజాన్ని డ్యూయీ ‘ద గ్రేట్ కమ్యూనిటీ’ అని సంబోధించాడు. విద్య ఒక అపురూపమైన వంగడం. దీన్ని సమాజంలో విత్తుకుంటూపోతే అది పెద్ద వృక్షంగా పెరిగి అభివృద్ధి రూపంలో ఫలాలనిస్తుందని, ప్రకృతిని ప్రపంచాన్ని లోతుగా మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, పౌరులుగా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, జీవన సంఘర్షణలను పరిష్కరించుకోవడానికి ప్రజలకు సదా ఉపయుక్తంగా ఉంటుందంటూ విజ్ఞులు చెపుతుండటం మనకు తెలిసిందే. మరి డ్యూయీ మహాశయుడు విద్యను వ్యక్తిలోని అన్ని సామర్థ్యాల అభివృద్ధిగా నిర్వచిస్తూ ఇంకా ఏమన్నాడో ఇక్కడ ఆలకించండి. ‘విద్య అనేది జీవితానికి ప్రిపరేషన్ కాదు; విద్యే జీవితం; ఒక లక్ష్యాన్ని చేరుకోవడం మరొక లక్ష్యానికి ప్రారంభ స్థానం; వైఫల్యం ఒక పాఠం, నిజమైన ఆలోచనాపరుడు వైఫల్యాల నుండి చాలా నేర్చుకుంటాడు, విజయాలను అందిపుచ్చు కుంటాడు; విజ్ఞాన శాస్త్రంలో ప్రతి గొప్ప పురోగతి ఊహ కొత్త ధైర్యసాహసాల నుండి వెలువడింది;

సంశయవాదం విద్యావంతుల మనస్సు గుర్తు, భంగిమ కూడా; సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం; నిజమైన విద్య అనుభవం ద్వారా వస్తుందని నమ్మడమంటే అన్ని అనుభవాలు నిజమైనవి లేదా సమానంగా విద్యా సంబంధమైనవని కాదు’. ఈ వాక్యాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే జాన్ డ్యూయీ మానవాళికి ఎంతటి మహత్తరమైన సందేశాన్నిచ్చి వెళ్లాడో, విద్యతో ఏయే మార్పులు సాధ్యమన్నాడో తెలుస్తుంది. డ్యూయీ వైవిధ్యభరితమైన మేధో సంపత్తి గురించి బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో ‘నేను నా మొత్తం మేధో జీవితానికి ప్రొఫెసర్ జాన్ డ్యూయీకి రుణపడి ఉంటాను. ఆయన నా గురువు’ అన్నాడు. ఇంకా విశేషించి చెప్పుకోవాల్సి వస్తే డ్యూయీ ప్రజాస్వామ్యాన్ని నైతిక ఆదర్శంగా భావించాడు. కేవలం రాజకీయంలా మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం రాజకీయాల నుండి ఆర్థిక వ్యవస్థ, తత్పోషిత సమాజపు సకల పార్శ్వాలకు విస్తరించాల్సిన శాస్త్రీయ ప్రక్రియ అన్నాడు. విద్యే ప్రజాస్వామ్యానికి పునాది అని, ఉపాధ్యాయుడిని ఒక ప్రొఫెషనల్‌గా, విద్యా సంస్థకు కేంద్రీకృత వనరుగా డ్యూయీ గుర్తించాడు. వ్యాసం మొదట ఉటంకించిన వ్యాఖ్య లో బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు గత కాలపు చీడలు చీకట్లు వర్తమాన వెలుగులను మసకబారేలా కర్కశంగా అడ్డుకుంటాయని, పాఠశాలే ఏజన్సీగా ఉండి సంఘ హితం, దేశ సౌభాగ్యం పరిమిళించేందుకు నడుం కట్టాలన్న ఉద్ఘాటన చూస్తే జాన్ డ్యూయీ ఎంతటి దార్శనికుడో, ప్రజాస్వామ్య విధేయుడో, విద్యా విప్లవకారుడో విదితం కాగలదు.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News