Monday, January 20, 2025

టెక్కీల నియామకంలో నెంబర్ 1

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లను నియమించుకునే అంతర్జాతీయ నగరాలలో హైదరాబాద్ టాప్ 20లో నిలిచింది. అలాగే భారతీయ నగరాల్లో హైదరాబాద్ నెంబర్‌వన్ స్థానంలో ఉందని టెక్నికల్ ఇంటర్వ్యూ సంస్థ కారత్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సింగపూర్, టోక్యో, వాంకోవర్, టొరంటో ఈ సంవత్సరం అగ్ర నగరాల ర్యాంకింగ్స్‌లో యుఎస్ టెక్ హబ్‌లైన సీటెల్, శాన్ ఫ్రాన్సిస్కోలను అధిగమించాయి. ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ, సింగపూర్ టెక్, ఫైనాన్స్ ప్రభుత్వ రంగ నియామకాలు 2022లో కొనసాగాయి. . డేటా సైంటిస్ట్‌లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఫ్రంట్ -ఎండ్, బ్యాక్-ఎండ్, ఫుల్-స్టాక్ డెవలపర్‌లకు విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. అత్యధిక యుఎస్ నగరాల్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ పనితీరుకు భారతదేశం ఒక ప్రత్యర్థిగా ప్రత్యేకమైన స్థానానికి దక్కించుకుందని నివేదిక పేర్కొంది.

ఈ సంవత్సరం భారతదేశంలోని ఆరు నగరాలు టాప్ 20లో ఉండగా,వీటిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలువగా, ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉంది. సాఫ్ట్‌వేర్ డవలపర్ల నియామకాలలో హైదరాబాద్ లండన్ తర్వాత స్థానంలో ఉండగా, వాషింగ్జన్ కంటే ముందుంజలో నిలిచింది. ఆగ్నేయాసియా అంతటా బలమైన ఇంజినీరింగ్ మార్కెట్ల ట్రెండ్‌ను కొనసాగిస్తూ, భారతదేశంలోని ఈ ఆరు నగరాలు ఈ సంవత్సరం టాప్ 20 స్థానాల్లో నిలిచాయి. -వేగవంతమైన డిజిటలైజేషన్ ట్రెండ్‌కు అనుగుణంగా గ్లోబల్ కంపెనీల నుండి నిరంతర పెట్టుబడులు ఈ రంగం ఎదుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, బెంగుళూరు, పూణే, ముంబై నగరాలు ఇతర అగ్ర నగరాలకు ధీటుగా నిలుస్తున్నాయి.

గతంలో కంటే ఇప్పుడు కంపెనీలు తమ వ్యాపారాలను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి సాంకేతిక ప్రతిభ కోసం చూస్తున్నాయని సింగపూర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ సంస్థ జిఆర్‌ఐటి సిఇఒ,వ్యవస్థాపకులు పాల్ ఎండకాట్ అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మకంగా, కొన్ని కంపెనీలు హైరింగ్ కోసం భారతదేశం లేదా ఇతర అంతర్జాతీయ ప్రాంతాలను చూసాయి, ఎందుకంటే వారు గొప్ప టెక్ టాలెంట్‌పై తక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశంగా భావించారని భండే కారత్ సిఇఒ మోహిత్ భండే వివరించారు. కానీ 2022లో, తాము కారత్ కస్టమర్లందరిలో మార్పును చూశామని, వారు మార్కెట్లో అత్యుత్తమ ప్రతిభను కోరుకుంటున్నారని తెలిపారు.
ఐటీలో మేటీ హైదరాబాద్
2021- 22 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన కొత్త కొలువుల్లోనూ హైదరాబాద్ నగరం బెంగళూరును అధిగమించింది. కొవిడ్ అనంతరం ఐటీ రంగం వేగంగా కోలుకుని సాధారణ స్థితికి రావడంతో గతేడాది దేశవ్యాప్తంగా కొత్త నియామకాలు భారీగానే సాగాయి. వీటిలో బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఒక శాతం నియామకాలు అధికంగా జరిగాయి. ముంబై (12 శాతం), పుణె (9), చెన్నై (5) తర్వాతి స్థానాల్లో నిలిచాయని సర్వే చేసిన ‘క్వెస్ ఐటీ స్టాఫింగ్ గ్రూప్’ తెలిపింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ కాగా ఇందులోనూ హైదరాబాదే (1,49,506) టాప్‌లో నిలువగా, బెంగళూరు (1,48,500)తో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌తో పోలిస్తే బెంగళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంటుంది. ఏటా వృద్ధి నమోదవుతుంది.

దానిని అధిగమించడం ఏ నగరానికీ ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. వీటిని గతంలోనే ప్రారంభించినా.. ఇక్కడ ఉన్న అనుకూలతల దృష్ట్యా పెద్ద ఎత్తున విస్తరణకు వెళ్లాయి. ఇలా ఏర్పడినవాటిలో ఒకటి.. అమెజాన్ రెండో అతి పెద్ద కార్యాలయం. గూగుల్ సైతం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థగా ఉంది. టీసీఎస్‌కు వివిధ నగరాల్లో కార్యాలయాలున్నా.. ఎక్కువ మంది పనిచేసేది హైదరాబాద్‌లోనే. మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పుతోంది.టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మరిన్ని కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థిరత్వం, మౌలిక వసతుల వృద్ధితో కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త ఉద్యోగాలూ పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News