హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత కూడా సాధించాడు. భార్యతో కలిసి తాజాగా వెకేషన్ కోసం ఇండోనేషియా వెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ నాగోల్ పీఎస్ సమీపంలోని అజయ్ నగర్ లో నివాసం ఉండే రాముని రవీందర్ కు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన వంశీకృష్ణ(27) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతూనే గ్రూప్-1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23వ తేదీన కర్మాన్ ఘాట్ కు చెందిన యువతితో అతడికి వివాహం జరిగింది. ఈనెల 13వ తేదీన భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహార యాత్ర కోసం వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తర్వాత ఇండోనేషియాలోని బాలీకి వెళ్లారు. ఈనెల 22వ తేదీన ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడి నిర్వాహకులు సూచించినట్లుగానే కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు.
కానీ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాక కోసం చాలా సేపు ఎదురు చూసినా పైకి అతడు పైకి రాకపోవడంతో నిర్వాహకులకు తెలిపింది. లోపలికి వెళ్లి చూసిన నిర్వాహకులకు కూడా అతడు కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.