మనతెలంగాణ/హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరివేకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన కృతి సంభ్యాల్(27) స్థానికంగా అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. నానక్‌రాంగూడలోని సాగర్ గార్డినియా అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి ఉంటోంది. రూమ్‌మేట్స్‌లో ఒకరు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లగా మరో యువతి బుధవారం ఫ్లాట్‌కు తాళం వేసుకుని విధులకు వెళ్లింది. గదిలో ఒంటరిగా ఉన్న కృతి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా మధ్యాహ్నం స్నేహితుడు సచిన్ కుమార్‌కు మెసేజ్ పంపింది. తనకు బతకాలని లేదని మెసేజ్ పంపడంతో వెంటనే అతడు వచ్చి చూసేసరికి తాళం వేసి ఉంది, ఫోన్ చేసినా స్పందించలేదు. వెంటనే అతను కృతి రూమ్‌మేట్‌కు ఫోన్ చేయగా తాళం పంపింది. తలుపులు తీసి చూడగా కృతి ఉరివేసుకుని ఉంది. స్థానికుల సాయంతో కిందకు దించి స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి పంపించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Software employee suicide in Gachibowli