Wednesday, January 15, 2025

‘ఫైర్’ తుపానులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

గత నవంబర్ నుండి అమెరికాలో సుమారు రెండు లక్షల మంది భారతీయ సాఫ్ట్‌వేర్ పనివారిని పలు కంపెనీలు ఉద్యోగాల్లోంచి తొలగించాయని అమెరికా దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన వార్త పెద్ద కలకలం రేపింది. అంతవరకూ సాధారణ చర్చగా సాగుతున్న ఈ అంశం ఒక్కసారిగా వేడెక్కి మన పత్రికల్లో పతాక శీర్షికకు చేరింది. ఉద్యోగ తొలగింపు విధానంలోనూ కంపెనీలు పాటిస్తున్న పద్ధతి చర్చనీయాంశమవుతోంది. రోజటిలా ఆఫీసుకు వెళుతున్నవారికి మార్గమధ్యంలోనే ‘మీ ఉద్యోగం పోయింది, ఆఫీసుకు రానవసరం లేదు’ అని ఫోనుకు మెసేజ్ వస్తోందట. ఉద్యోగనియామకం కోసం ఇంటర్వ్యూ తీసుకొంటున్న ఉద్యోగి ఎదుట ఉన్న అభ్యర్థి ఫలితం తేల్చేలోగా ఆయనే తన ఉపాధి కోల్పోయాడట.

అంటే ఉద్యోగిని ఎంపిక చేసే ఉద్యోగే మధ్యలోనే గేటు దాటాల్సి వచ్చింది. కొడుకు పుట్టిన సందర్భంలో శుభాకాంక్షలుపంపిన గూగుల్ కంపెనీ మరునాడే ఉద్యోగంలోంచి తీసేసిన సమాచారం ఆ తండ్రికి పంపినదట. పది మంది పనిచేసే ప్రాజెక్ట్ నుండి ఎనిమిది మందిని తీసేసి ఇద్దరిపై పూర్తి పని భారం మోపుతున్నారు. కాదంటే తమ ఉద్యోగమూ ఊడుతుందనే భయంతో కిమ్మనకుండా భరిస్తున్నారట. కంపెనీ ఉద్యోగులకన్నా కాంట్రాక్ట్ పద్ధతిన చేసేవారు ఎక్కువ రోడ్డున పడుతున్నారని అంటున్నారు. అయితే అమెరికాలో ఉద్యోగంలోంచి తీసెయ్యండం ఇంత తెలీకనా, కనీస ఉద్యోగ భద్రత కల్పించే కార్మిక చట్టాలు అక్కడ ఉండవా, కంపెనీలు కూడా అంత కనికరం లేకుండా నెట్టివేస్తాయా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఒక బహిరంగ సభలో ‘నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించగలను కానీ ఉద్యోగిని తీసేయలేను’ అని అన్నారట. ఉద్యోగ భద్రతకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదేమో! ఆమాట ఇప్పుడు అమెరికాలో అపహాస్యమవుతోంది. అయితే ప్రయివేట్ సెక్టార్ మాటే వేరు. చిన్న ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న గ్యారెంటీ పెద్ద కంపెనీ సిఇఒకు కూడా ఉండదు. 2016లో టాటా కంపెనీకి చైర్మన్‌గా పని చేసిన సైరస్ మిస్ట్రీని ఒక్క పెన్ను పోటుతో బయటకు పంపారు. ప్రయివేటు ఉద్యోగమంటే అంతా యజమాని చలువపైనే ఆధారపడి ఉంటుంది.

మొత్తానికి అమెరికాలో పని చేస్తున్న మన వాళ్ళు ఉద్యోగం ఏ క్షణం పోతుందోననే భయంతో వణికిపోతున్న మాట నిజమే అయినా ‘ఫైర్’ అయిన వాళ్లెవరూ మూటాముల్లె సర్దుకొని ఇండియా బాట పట్టడం లేదనేది కొంత ఊరట కలిగించే విషయం. ఉద్యోగం పోయిన హెచ్ 1 బి వీసా పై అక్కడ ఉన్నవాళ్లు 60 రోజులు అమెరికాలో ఉండే వీలుంది, ఆలోగా ఏదో ఓ ఉద్యోగంలో చేరి అమెరికా నేలపై కాలు అలాగే ఉండే పరిస్థితిని కాపాడుకుంటున్నారు. స్థూలంగా చెప్పాలంటే ఉద్యోగాలు పోతున్నాయి, పోయినా ఆపత్కాల బంధువుగా మరోటి దొరుకుతోంది. అయితే కొత్త ఉద్యోగం ముందు దాని కన్నా తక్కువదా ఎక్కువదా అన్న ప్రసక్తి లేకుండా బతుకైతే గడుస్తోంది అన్నమాట. పత్రికల్లో వచ్చిన బెంబేలు కన్నా ఇది కాస్తా ధైర్యాన్ని కలిగిస్తోంది. మరోమాట ఏమిటంటే కొత్త ఉద్యోగం దొరకబుచ్చుకోవడం కూడా కఠిన సమస్యగానే ఉందట. ఉద్యోగం పోయినవాళ్లు వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి ఉద్యోగావకాశాల సమాచారాన్ని పంచుకుంటున్నారు. కన్సల్టెన్సీ సంస్థలు కూడా చురుగ్గా పని చేస్తూ అవసరార్థ కంపెనీల వివరాల్ని అందజేస్తున్నాయి. వ్యవహారమంతా కొద్దిగా అటుఇటుగా తుఫానులో చిక్కుకున్నవారు ఆసరాకు వెతుకుతున్నట్లుగా ఉంది. ముందో వెనుకో ఆసరాపై నమ్మకం మాత్రం కనబడుతోంది.

ఉద్యోగాలకై భారతీయులు భారీగా వలస వెళ్లడం మొదలై సుమారు యాభై ఏళ్లవుతోంది. అంతకు ముందు విద్యార్థులకు బ్రెయిన్ డ్రైన్ అనే అంశంపై వ్యాసం రాయమని ప్రశ్న వచ్చేది. బ్రెయిన్ డ్రైన్ అంటే మన తెలివి విదేశాల్లోని తరలి వెళ్లిపోవడం. చదువుకున్నవారు విదేశాలకు వెళ్లడం వల్ల ఇక్కడ నేర్చుకున్న విజ్ఞానమంతా కాలువల్లో బయటికి పారి మనకు పనికిరావడం లేదని అర్థం. ఆ రోజుల్లో బ్రెయిన్ డ్రైన్‌ను ఖండిస్తూ రాయడమే సరియైన జవాబు అన్నమాట. 1980లో హైదరాబాద్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ‘మన దేశంలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయి. వీలైనంత మంది బయటి దేశాలకు వెళ్లి ఉపాధి పొంది దేశానికి ఆర్థిక సమృద్ధిని పెంచండి’ అన్నారు. అలా గత పాతిక ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగం పెరిగి మనవాళ్లకు అమెరికాతో సహా మరి కొన్ని దేశాలు మాతృదేశం కన్నా సౌకర్యవంతమైన జీవితాల్ని అందిస్తున్నాయి. ఈ హాయిలో అడపాదడపా ఒడుదొడుకులు తప్పడం లేదు.

అయితే వీటి నుండి తట్టుకునేందుకు సీనియర్ ఉద్యోగులు ముందస్తు ప్రణాళికగా జాగ్రత్తలు పడుతుంటారు. మంచికాలంలో వీలయినంత పొదుపు చేసి ఏడాదిపాటైనా నిలదొక్కుకునే ఆర్థిక ఏర్పాట్లు చేసుకొంటారు. అయితే ఎంతో ఖర్చుతో అమెరికా చేరి కొత్తగా ఉద్యోగంలో చేరినవారు పరిస్థితి దారుణంగా ఉంది. చేరిన మూడు నెలలకే ఉద్యోగం కోల్పోయినవారు కూడా ఉన్నారు. కొడుకును చదివిస్తున్న ఒంటరి తల్లి పరిస్థితి కూడా ఇదే. జీతంలో అధిక భాగం బ్యాంక్ అప్పు వాయిదాలు కట్టేవారు పెనాల్టీల వలలో చిక్కుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పొతే రాబోయే ఇక్కట్లు ఎన్నో ఉన్నాయి. అయితే పరిస్కారం దిశగా ఆలోచిస్తే ముందు ఉద్యోగం తీసేసే కంపెనీయే కొంత ఉదాసీనంగా, కొంత బాధ్యతగా వ్యవహరించాలి. ఒకప్పుడు తిన్నా అరగనంత పెట్టి ఇప్పుడు కడుపు ఎండబెట్టడం ధర్మం కాదు.

సాధ్యమైతే జీతంలో కోత పెట్టి కొనసాగించాలి. లాభాల్లోంచి కొంత రక్షణ నిధి ఏర్పరచి తొలగించిన ఉద్యోగికి నిర్ణీత కాలం ఆదుకోవాలి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించడం అమానవీయమే. తమ లాభాల కన్నా సాటి మనిషి మేలు కోరడమే ఉత్తమ వ్యాపార లక్షణం. మరోవైపు యజమానిపై ఔదార్యంపై ఆధారపడకుండా ఉద్యోగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులైన తమ తోటివారిని పరస్పర సహకార దృష్టితో ఉద్యోగులు చేరదీయాలి. తెలుగు సంఘాలు, సమాజాలు తమ నిధులను వీరి కోసం వెచ్చించాలి. చివరగా అయిన అత్యంత ప్రధాన విషయమేమిటంటే ఆయా దేశాల ప్రభుత్వాలు ఇవేమి తమకు పట్టనట్లుగా ఉండకూడదు. ఉద్యోగి భద్రతకు సంబంధించిన చట్టాల రూపకల్పన చేయాలి. ఇది ఆర్థిక మాంద్యమో, ఉద్యోగుల సర్దుబాటో ఏదైనా కంపెనీలు ఉద్యోగులను నిరాశ్రయుల్ని చేస్తుంటే అడ్డుకట్ట వేసే శక్తి, బాధ్యత ఆయా ప్రభుత్వాలకే ఉంటుంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News