Thursday, January 23, 2025

ఉద్యోగాల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, బ్యాంక్ పాస్‌బుక్, రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని ప్రకాశం జిల్లా, ఒంగోలుకు చెందిన మచ్చు శివప్రసాద్, ధన్‌రాజ్, బట్టగిరి రంగా పార్ధు ముగ్గురు కలిసి మోసాలు చేస్తున్నారు. శివప్రసాద్ గతంలో యాక్సెంచర్, ఇన్‌ఫోసిస్, ఇన్నోమైండ్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆర్థికమాద్యం వల్ల ఉద్యోగం కోల్పోయాడు. దీంతో గతంలో తనతోపాటు ఇన్‌ఫోసిస్‌లో పనిచేసిన ధన్‌రాజ్‌తో కలిసి నిరుద్యోగులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం పేరుతో మోసం చేయాలని ప్లాన్ వేశాడు. ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో డబూబ్లన్‌సి గ్లోబల్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఉన్నాయని పోస్టింగ్ పెట్టారు.

దానిని చూసి సంప్రదించిన వారికి నిందితులు ఇంటర్వూలు నిర్వహించారు. వాట్సాప్‌లో సంప్రదించిన బాధితుల వద్ద నుంచి ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో రూ.20,000 వసూలు చేశారు. తర్వాత వారికి ఇంటర్వూలు నిర్వహించి మొత్తం రూ.1,60,000 వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగానికి ఎంపికయ్యారని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. వాటిని తీసుకున్న బాధితులు మాదాపూర్‌లోని రాహేజామైండ్ స్పేస్‌లో ఉన్న కార్యాలయానికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాము ఎలాంటి ఇంటర్వూలు నిర్వహించలేదని, అది నకిలీ లెటర్ అని చెప్పడంతో బాధితులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే రంగపార్ధు, శివకు ఫోన్ చేయగా వారు స్పందించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ధన్ రాజ్ అనే నిందితుడు పరారీలో ఉండగా, మిగతా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News