Sunday, December 22, 2024

ఇంటర్ తోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన కుదిరిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంఛార్జ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తో గురువారం నాడు తన కార్యాలయంలో సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

ఇందులో కనీసం 60 శాతం మార్కులు పొందిన విద్యార్థులకు వర్చువల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించి విద్యార్థులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని వివరించారు. ఈ శిక్షణ పూర్తి అయినవారికి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించి ప్రతీ నెలా రూ.10 వేలు స్టైఫండ్‌గా అందిస్తారని తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే రూ.2.5 లక్షల వార్షిక వేతనంపై పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. వీరికి ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారని అన్నారు. వీరి అనుభవం పెరుగుతున్న కొద్దీ ఏటేటా వేతనాన్ని పెంచుతారని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని మంత్రి తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
రాష్ట్రంలో మార్చి 15 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నామినల్ రోల్స్ నుండి పరీక్షలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలను వెల్లడించేనాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఉతీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంచార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News