Thursday, January 23, 2025

రాష్ట్రానికి దక్కని సాఫ్ట్‌వేర్ పార్క్

- Advertisement -
- Advertisement -

Software park not allocated to Telangana

తాజాగా ప్రకటించిన 22సాఫ్ట్‌వేర్ టెక్నాలాజీ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించకపోవడం
కేంద్రం వివక్షకు నిదర్శనం: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల (ఎస్‌టిపిఐ) కేటాయింపుల్లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రా మారావు తీవ్రస్థాయిలో అసంతృప్తి…ఆగ్రహం వ్యక్తం చేశా రు. కేంద్రం తాజాగా ప్రకటించిన 22 సాఫ్ట్‌వేర్ టెక్నాలిజీ పార్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రానికి కేటాయించక పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్రం పై కేంద్రం కొనసాగిస్తున్న వివక్ష అనకపోతే ఆయన ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్రాల పట్ల కేంద్రానికి ఉన్న బాధ్యత అని మండిపడ్డారు. ఇది ఫెడరల్ స్పూర్తిగా విఘాతం కల్పించినట్లు కాదా? అని నిలదీశారు. ఏ విషయంలో చూ సిన కేంద్రం అడుగడుగునా రాష్టంపై సవతిప్రేమ చూపిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళలకు సాఫ్ట్‌వేర్ పార్కులను కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఒక్కటంటే ఒక్కదాన్ని కేటాయించకపోవడం అన్యాయమన్నారు.

ఈ మేరకు శనివారం కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. ఆ లేఖలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో గర్హించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపై సమగ్రంగా లేఖలో వివరించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్న తెలంగాణకు కేంద్రం మరింత చేయూతనందించాల్సింది పోయి… అడుగడుగునా నిర్లక్షం చేస్తుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. ఐటి పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని అన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధిరేటును గత కొన్ని సంవత్సరాలుగా నమోదు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.

2014..20-15లో కేవలం రూ. 57,258 కోట్ల మేర ఉన్న ఐటి ఎగుమతులు ప్రస్తుతం రూ. 1,45,522 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఐటి రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా 6,28,000పైగా పెరిగిందని కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ కర్నాటక రాష్ట్రాన్ని మించిపోతున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్థావించారు. ఐటి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటా సెంటర్ వంటి వివిధ రంగాలకు ప్రత్యేకమైన పాలసీలతో ఐటి రంగ అభివృద్ధిని సాధిస్తున్న విషయంతో పాటు ఆయా విధానాలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ప్రశంశలను మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తన లేఖలో ప్రస్తావించారు. దేశ ఐటీ రంగంలోనే కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖమైన ఐటి హబ్ గా మారిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు అనేకం పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంతో పాటు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయాలతో పాటు మౌళిక వసతుల కల్పనకు కూడా చేస్తున్న విషయాన్ని కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా పట్టణాలు ఏర్పాటు చేసిన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను వినియోగించుకొని వివిధ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున ఐటి పరిశ్రమతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యాన్ని పట్టించుకోకుండా, సాప్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం, ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని విమర్శించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్ రీజియన్ -ఐటిఐఆర్ రద్దు చేసి రాష్ట్ర ఐటి రంగానికి, యువతకి తీరని ద్రోహం చేసిన విషయాన్ని తన లేఖలో మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు.

ఈ ఐటిఐఆర్ పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారన్నారు. అలాగే ఐటి శాఖ మంత్రిగా తాను, తమ ఎంపీల బృందం పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. పైగా ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. దేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. విశాల దృక్పథంచో కేంద్రం వ్యవహరించి రాష్ట్రానికి వెంటనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని మంత్రి కెటిఆర్ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News