ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్
మనతెలంగాణ/ హైదరాబాద్ : వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ వినియోగంతో భూసారం పెంచే వీలుందని ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. వాణీప్రసాద్ అన్నారు. శుక్రవారం నగరంలోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ ప్రాంగణంలో వేస్ట్ టు వెల్త్ (ట్రాన్స్‌ఫార్మింగ్ రిసోర్సెస్ ఫర్ సాయిల్ ఫెర్టిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్) అనే అంశంపై సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యర్థాల నుండి ఉత్పత్తి చేయబడిన కంపోస్ట్‌ను నేలను సుసంపన్నం చేయడానికి ఎరువుగా ఉపయోగించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం వంటి వివిధ పథకాల గురించి పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ ఆయిల్ ఫామ్ ఉత్పత్తిని వైవిధ్యభరితంగా చేపట్టి పైకప్పు సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మట్టి జీవశాస్త్రాన్ని మెరుగుపరచడం ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్‘ సాధ్యపడుతుందన్నారు. సదస్సులో పిఆర్ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ విజయ్‌కుమార్, సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కర్లపూడి, సుకృత్ కుమార్, నాబార్డ్ జనరల్ మేనేజర్ పి.టి.ఉష, సుభాష్ బైరా, సాంఘిక సంక్షేమం, బిసి సంక్షేమం, జిహెచ్‌ఎంసి, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డ్, విశ్వ ఆగ్రోటెక్ శాఖల అధికారులు హాజరయ్యారు.