ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సమస్యల్లో నేల లవణీకరణం కావడం. పర్యావరణ వైవిధ్యం లేదా మానవ కల్పిత చర్యల వల్ల కానీ సారవంతమైన నేలలు ఉప్పుమయమై పోతే పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాదు సారవంతమైన నేలలు కూడా ఎందుకూ పనికి రాని వట్టి బంజరు భూములుగా మారతాయి. నేల ఉపరితలంపై మట్టిలో ఉప్పు సాంద్రత పెరిగిపోవడాన్ని లవణీకరణ అంటారు. వరదలు ముంచెత్తడం, భూగర్భజలాల్లో వ్యర్ధాలు పేరుకుపోవడం, అడవులను నాశనం చేయడం, వాటి స్థానంలో వ్యవసాయ భూములు విస్తరించడం, కాలుష్యాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల నేల లవణీకరణమవుతుంది.
ఈ లవణీకరణ వల్ల తీవ్రంగా నష్టపోయేది మొదట వ్యవసాయ రంగమే. ఈ పరిస్థితిని నియంత్రించ లేకుంటే నేలలో ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పంటల ఉత్పత్తి తగ్గిపోతే ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చు. ఏటా 19 కోట్ల ఎకరాల నేల లవణీకరణంగా మారిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ఈజిప్టు, ఆస్ట్రేలియా దేశాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది. భారత్‌లో 67 లక్షల హెక్టార్ల భూములు ఉప్పుబారి పోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో తీర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కర్ణాటకలో 2 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.70 లక్షల హెక్టార్లు, లవణీకరణ అయ్యాయి. తరువాతి స్థానాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించలేకుంటే , నీటి పారుదల వ్యవస్థలోమార్పులు తీసుకురాకుంటే 2050 నాటికి ప్రపంచంలో 50 శాతం సాగుభూములు ఉప్పుమయంగా మారక తప్పదు. వ్యవసాయం నశించి ఆహార సంక్షోభం కమ్ముకుని రావచ్చు