నిలువ చేసిన లోతైన నీటిలో చేపలు పట్టేందుకు నూతన మార్గాలు
తెప్పల వేటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్సకారులు
విదేశాలల్లో ఉన్న పద్దతులను అధ్యయనం చేసిన ఆశాఖ అధికారులు
ఇంధన ఖర్చులేని పర్యావరణహితమైన మార్గాలపై సమాలోచనలు
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగంలో చేపల వేటకు సంబంధించి వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణలోని మత్స్యకారులో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు వీలుగా అనేకమైన ఆధునిక విధానాలను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ( ఫిషరీస్ ఫెడరేషన్) ముమ్మర ప్రయత్నాలను ప్రారంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో నిలువచేసిన లోతైన నీటిలో చేపలు పట్టేందుకు అనుగుణంగా మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామాగ్రిని సమకూర్చేందుకు వీలున్న మార్గాలను మత్స్య సహకార సంఘాల సమైక్య కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా జలాశయాలలో తక్కువ నీటి పరిమాణంలో ఎక్కువ మోతాదులో శ్రీగతిన చేపలను పెంచేందుకు అనువైన కేజీ కల్చర్ విధానాల పట్ల సాంప్రదాయ మత్స్యకారుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మత్స్యశాఖ ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ సదస్సులను నిర్వహించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు 100కు పైగా రిజర్వాయర్లలో దాదాపు లక్ష మందికిపైగా మత్స్యకారులు తెప్పల సహాయంతో చేపల వేటను కొనసాగించి జీవనభృతిని పొందుతున్నారు. అయితే లోతైన నీటి నిలువను కలిగి ఉండే రిజర్వాయర్లో తెప్పలపై ప్రయాణం సురక్షితం కాకపోవడంతో మత్స్యకారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెప్పలను నీటిపై నడపడం వాటిపైన వలలో చేరవేయడం జలాశయాలు పట్టిన చేపలను ఒడ్డుకు రవాణా చేసుకోవడం లాంటి కీలకమైన పనుల నిర్వహణలో తెప్పల వినియోగం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని విపత్కర పరిస్థితిలో మత్స్యకారులు ఈ తెప్పలు వినియోగం కారణంగా ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తిప్పలు రిజర్వాయర్ నీటి మీద నడపడానికి మత్స్యకారులు తమ రెండు చేతులను ఉపయోగించి తెడ్డు సహాయంతో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా మత్స్యకారుల శరీర శ్రమ విపరీతంగా వినియోగించాల్సి ఉంటుంది.
తెప్పలపై కూర్చోవడం కూడా ఇబ్బంది కావడంతో పాటుగా తెప్పలు నడుపుతున్న సమయంలో మత్స్యకారులు తమకాలను మోకాల్లోతు నీటిలో ఉంచాల్సి ఉంటుంది ఈ కారణంగా మత్స్యకారుల కాళ్ళు నీళ్లలో నాని పుండు కొట్టి అనారోగ్యం పాలవుతున్న సందర్భాలు కోకొలల్లుగా ఉన్నాయి. అదేవిధంగా తెప్పల పైన పైకప్పు లేకపోవడం వల్ల ఎండాకాలం విపరీతమైన ఎండలు భరించాల్సి వస్తుంది. అదేవిధంగా వర్షాకాలంలో చేపల వేటను మానుకోవాల్సి వస్తుంది జలాశయంలో చేపలు పట్టే మత్స్యకారులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందుల నుండి వారిని రక్షించేందుకు వీలున్న మార్గాలను తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ అన్వేషిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ స్వయంగా ఒక మత్స్యకారుడు కావడం, మత్స్య సహకార సంఘంలో సభ్యునిగా కొనసాగుతుండడం రిజర్వాయర్ ఫిషరీస్ లో దేశ విదేశాలలో అమలులో ఉన్న విధానాలపై ఆయన స్వయంగా అధ్యయనం నిర్వహించిన అనుభవం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని జలాశయాల్లో తెప్పల వినియోగం ఫలితంగా ఇక్కడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అదేమించేందుకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించ గలిగారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాలలో మత్స్యకారులు చేపల వేట కోసం వినియోగించే మర పడవలు డీజిల్, పెట్రోల్, లాంటి ఇంధనంతో నడిచే మోటర్ బోట్ల వినియోగంపై కూడా ఫిషరీస్ ఫెడరేషన్ విసృతంగా అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా తనకు కలిగిన అవగాహనను జోడించి ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను అనుసరించాలని ఆలోచించారు. వీటన్నిటిని ఫలితంగా తెప్పల వినియోగం స్థానంలో సౌరశక్తి (సోలార్) వినియోగంతో ఎలాంటి ఇందన ఖర్చులకు అవకాశం లేని పద్ధతిలో మత్స్యకారులకు అనేక రకాలుగా ఉపయోగపడే సురక్షితమైన ఫిషింగ్ బోట్స్‌ను ప్రవేశపెట్టాలని యోచించుతున్నారు. తన అనుభవాల నుండి రిజర్వాయర్లలో చేపలు పట్టే మత్స్యకారులకు అవసరాలకు అనుగుణంగా ఈ రంగంలోని పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు సంప్రదించారు. ఎలాంటి ఇంధన వనరుల వినియోగం లేకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలవకుండా సౌరశక్తి నీటి అలల నుండి ఉత్పత్తి చేయగలిగే విద్యుత్ శక్తి ఆధారంగా నడిచే హైబ్రిడ్ మోటార్లను బోట్లను వినియోగంలోకి తేవడం ద్వారా రాష్ట్రంలో రిజర్వాయర్లో తెప్పలపై చేపలు పట్టే లక్షలాదిమంది మత్స్యకారులకు సురక్షితమైన సౌకర్యనాన్ని అందించేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.
ఈ ఆలోచనను అమల్లో తేవడానికి కేరళ రాష్ట్ర రాజధాని కొచ్చిన్ లో నెలకొల్పిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ వారి సహాయ సహకారాలను తీసుకొనున్నట్లు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే కొచ్చిన్ లోని ఆ సంస్థ సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలు నిపుణులతో ప్రత్యేకంగా చర్చించునున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రాథమికమైన అవగాహన కోసం హైదరాబాదులోని బిట్స్ పిలాని సంస్థలో పనిచేస్తున్న నిపుణులతో రెండు రోజుల కితం చర్చ జరిపారు. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ప్రతిపాదిస్తున్న ఈ బృహత్ ప్రయోగానికి శాస్త్రీయంగా సాంకేతికంగా తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోర పాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలోనూ ప్రస్తుతం మత్స్యకారులు ఉపయోగిస్తున్న నాటు తిప్పలు పుట్టిల స్థానంలో సౌరశక్తి మరియు ఆలల శక్తిల సంయుక్త వినియోగంతో నడిచే హైబ్రిడ్ ఫిషింగ్ బోట్స్ ను ప్రవేశపెట్టే ప్రక్రియకు ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే శ్రీకారం చుట్టగలమని ఫిషెరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్‌తెలిపారు.