Saturday, November 9, 2024

ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభిస్తాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్‌ఛేంజ్‌తో పాటు మూసీపై నిర్మిస్తున్న బ్రిడ్జిలకు శంకుస్థాపన చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు రూ.10వేల కోట్లతో మూసీపై ఎక్స్‌ప్రెస్ స్కై వేకు ప్రతిపాదన రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రూ.29.50 కోట్లతో నార్సింగి ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించుకున్నామని, ఓఆర్‌ఆర్‌పై ఇది 20వ ఇంటర్‌ఛేంజ్ ఆయన అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఔటర్ స్పీడ్ లిమిట్‌ను 120 కిలోమీటర్లకు పెంచామని మంత్రి చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు హైదరాబాద్‌కు మణిహారంలా మారిందని ఆయన వెల్లడించారు.
సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకత రాబోతుంది
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, ఐదు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామన్నారు. దానికి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు కానుందని చెప్పారు. మూసీ నదిపై స్కైవేను నిర్మిస్తామని కెటిఆర్ తెలిపారు. కరోనా వల్ల మూసీ సుందరీకరణను అనుకున్నంత వేగంగా చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. రెండున్నర ఏళ్లలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోను పూర్తిచేస్తామని కెటిఆర్ వెల్లడించారు. బిహెచ్‌ఈఎల్ నుంచి కందుకూరు ఫార్మాసిటీ వరకు మెట్రో రైలు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దేశంలోని ఏ మెట్రో నగరానికి లేని ప్రత్యేకత సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్‌కు రాబోతుందని కెటిఆర్ వెల్లడించారు. అందులో మొదటి ఫలితాలు నేడు అందుతున్నాయన్నారు.
ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లు ఫోర్ లైన్ రోడ్లుగా…
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్ ఎంతో ఉపయుక్తంగా ఉందని, ఔటర్ చుట్టూ పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మరికొన్ని ఇంటర్‌ఛేంజ్ లను నిర్మిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరం చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్లను ఫోర్ లైన్ రోడ్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని, సిఎం ఆదేశాల మేరకు ఔటర్ సర్వీస్ రోడ్ల విస్తరణ చేపడతామని మంత్రి కెటిఆర్ చెప్పారు. మెట్రో రైలును బిహెచ్‌ఈఎల్, ఫార్మాసిటీ, కందుకూరు వరకు పొడిగించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కెటిఆర్ చెప్పారు.
రూ.3,866 కోట్లు…. 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు
నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి చేయబోతున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మురుగునీటి శుద్ధి కోసం దాదాపు రూ.3,866 కోట్లతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపిల) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, అందులో మొదటిది కోకాపేటలో ప్రారంభిస్తున్నామన్నారు. సెప్టెంబర్ నాటికి దశలవారిగా దేశంలోనే 100 శాతం మురుగునీటిని శుద్ధిచేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నట్టు ఆయన చెప్పారు. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగిం చేలా ప్రభుత్వం ఒక విధానం తీసుకురాబోతుందని కెటిఆర్ వెల్లడించారు. తద్వారా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం నెరవేరుతుందని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు
హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలో స్కైవాక్ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగామని కెటిఆర్ చెప్పారు. దీంతోపాటు కొత్త లింక్ రోడ్లకు సహకరించాలని అడిగామని, జూబ్లీ బస్టాండ్ వరకు స్కైవాక్ కోసం భూములు కేటాయించాలని కోరామన్నారు. భూమికి బదులు భూమి ఇస్తామన్నప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రధాని తీపి కబురుతో రాష్ట్రానికి రావాలి
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా తాము ఇచ్చిన వినతులపై తీపికబురు అందించాలని మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్‌కుమార్, హెచ్‌ఎండిఏ అర్భన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ హెచ్‌జిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎల్ ఎన్‌రెడ్డి, డైరెక్టర్ (ప్లానింగ్) బాలకృష్ణ, హెచ్‌జిసిఎల్ సిజిఎం రవీందర్, ఎస్‌ఈలు హుస్సేన్, పరంజ్యోతి, నార్సింగి ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.
కొత్తగా మరో మూడు ఇంటర్‌ఛేంజ్‌ల నిర్మాణం
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగురోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. నార్సింగి, కోకాపేట నియోపొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో కొత్తగా మరో మూడింటిని హెచ్‌ఎండిఏ నిర్మిస్తోంది. ఇందులో నార్సింగి ఇంటర్‌ఛేంజ్ పనులు పూర్తికావడంతో వాహనాలను అనుమతించనున్నారు. గ్రేటర్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు వరకు కోర్ సిటీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను రేడియల్ రోడ్లుగా గుర్తించి ఎంతో విశాలంగా, సిగ్నల్ అవసరం లేకుండా ఈ ఇంటర్ ఛేంజ్‌లను హెచ్‌ఎండిఏ నిర్మిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News