Wednesday, January 22, 2025

రాత్రిపూట కూడా సౌరవిద్యుత్ ఉత్పత్తి!

- Advertisement -
- Advertisement -

Solar power generation even at night

నూతన టెక్నాలజీని రూపొందించిన న్యూసౌల్‌వేల్స్ యూనివర్శిటీ శాస్త్రజ్ఞులు

సిడ్నీ: సౌర విద్యుత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద స్వచ్ఛ ఇంధన వనరుగా తయారైన విషయం తెలిసిందే. అయితే ఈ సౌర విద్యుత్ ఉత్పత్తికి సూర్యుడు మూలాధారం కావడంతో పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే సౌర శక్తినుంచి రాత్రిపూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల టెక్నాలజీని ఆస్ట్రేలియా సిడ్నీలోని న్యూసౌత్‌వేల్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ‘థర్మోరేడియాక్టివ్ డైయోడ్’ అనే సెమీ కండక్టర్ పరికరాన్ని ఉపయోగించి సౌర ఫలకంనుంచి ఇన్ఫ్రారెడ్ లైట్ రూపంలో వాతావరణంలోకి ప్రసరించే వేడినుంచి విద్యుత్‌ను వీరు ఉత్పత్తి చేశారు. నైట్‌విజన్ కళ్లద్దాల్లో ఉపయోగించే మెటీరియల్‌తో ఈ ‘నైట్‌టైమ్’ సోలార్‌పవర్ పరికరాన్ని రూపొందించారు. అయితే ఈ దశలో ఉత్పత్తి అయిన విద్యుత్ చాలా స్వల్పంగా అంటే ఓ సౌర ఫలకం సరఫరా చేసే విద్యుత్‌లో దాదాపు లక్షో వంతు మాత్రమే ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఈ సామర్థాన్నిపెంచగలుగుతామని శాస్త్రజ్ఞుల బృందం అశిస్తోంది. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్ ‘ ఎసిఎస్ ఫోటోనిక్స్’లో ప్రచురితమైంది.

‘థర్మోరేడియాక్టివ్ పరికరాన్ని ఉపయోగించి విద్యుచ్ఛక్తిని ఎలా ఉత్పత్తి చేయవచ్చో మేము తిరుగులేని విధంగా నిరూపించగలిగాం. రాత్రిపూట వాతావరణంలో ఎంత రేడియేషన్ ఉంటుందో థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి మనం చూడవచ్చు. అయితే ఇది కంటికి కనిపించే వేవ్‌లెంగ్‌తల్లా కాకుండా పరారుణ విద్యుదయస్కాంతాల(ఇన్‌ఫ్రారెడ్) రూపంలో ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ రేడియేషన్‌నుంచి విడుదలయ్యే వేడినుంచి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే ఒక పరికరాన్ని తయారు చేయడమే మేము చేసిన పని’ అని ఈ బృందానికి నాయకత్వం వహించిన అసోసియేటెడ్ ప్రొఫెసర్ నెడ్‌ఎకిన్స్ డ్యూక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. పగటి పూట సూర్యుడినుంచి వచ్చే సౌర విద్యుత్‌తో ఈ భూగోళం వేడెక్కుతుంది. అదే తిరిగి రాత్రి పూట ఇన్ఫ్రారెడ్ లైట్ రూపంలోఅంతరిక్షంలోకి చేరుకుంటుందనేది సైన్స్ చెప్పే విషయం. ఈ టెక్నాలజీయే వీరి పరిశోధనకు మూలం. రాత్రిపూట భూ ఉపరితలంనుంచి అంతరిక్షంలోకి ఎంత వేడి ప్రసరిస్తుందో థర్మల్ ఇమేజింగ్ కెమెరాను ఉపయోగించి ఈ శాస్త్రజ్ఞులు చూపించారు కూడా.

‘శక్తి ప్రవాహం ఉన్నప్పుడు దాన్ని మనం వివిధ రకాల్లోకి మార్చవచ్చు. సూర్యుడి వెలుతురును నేరుగా విద్యుత్‌గా మార్చే విధానం ఫోటోవోల్టాయిక్స్ విధానం. సౌర శక్తిని విద్యుత్‌గా మార్చడానికి మానవుడు అభివృద్ధి చేసిన విధానం ఇది. థర్మోరేడియాక్టివ్ విధానం కూడా అలాంటిదే. వేడెక్కిన భూమిపైనుంచి చల్లగా ఉండే విశ్వంలోకి చేరే ఇన్ఫ్రారెడ్‌నుంచి శక్తిని మేము విద్యుత్‌లోకి మళ్లిస్తున్నాం అంతే’ అని ఈ పరిశోధకుల బృందంలో ఒకరైన డాక్టర్ పియర్స్ తెలిపారు. కాగా ఈ టెక్నాలజీని అనేకప్రాడక్ట్‌లలో ముఖ్యంగా భ్యాటరీల ద్వారా విద్యుత్ లభించే పరికరాల్లో ఉపయోగించవచ్చని స్కూల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్, రెన్యుయబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కు చెందిన ఈ పరిశోధకుల బృందం భావిస్తోంది. అంటే ఈ టెక్నాలజీ కొన్ని పరికరాల్లో బ్యాటరీల అవసరం లేకుండా చేయడమో లేదా బ్యాటరీల చార్జింగ్‌లో తోడ్పడడమో చేస్తుంది అని ఎకిన్స్ డ్యూక్స్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News