Friday, April 25, 2025

సౌర విజ్ఞాన ఖని డా. పరమేశ్వరన్ వెంకటకృష్ణన్

- Advertisement -
- Advertisement -

భారతదేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనా ప్రణాళికలో డా. పరమేశ్వరన్ వెంకటకృష్ణన్ నిర్వహించిన పాత్ర గణనీయ మైంది. భారతదేశపు తొలి అంతరిక్షపు సోలార్ అబ్జర్వేటరీ ‘ఆదిత్య ఎల్ వన్’ (Aditya L1) సాకారం కావడంలో వీరు కీలక భూమిక వహించారు. పదవీవిరమణ చేసిన తర్వాత కూడా యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ సంబంధిత పరిశోధనలు మరింత ముందుకు తీసుకువెళ్లారు. సుమారు 100దాకా పరిశోధనాపత్రాలు గల వీరి నేతృత్వంలో 13 మంది పరిశోధన పట్టాలు గడించారు.

ఆవాసం, ఆహారం, శక్తి అవసరాలు సంబంధించి ఇతర గ్రహాల వైపు చూసే కాలమిది. కనుక అంతరిక్ష పరిశోధన అనేది వాతావరణం, చంద్రుడు, తోకచుక్కలు, అసలు చుక్కలు, చంద్రుని వంటి సహజ ఉపగ్రహాలు స్థాయిని అధిగమించి ఇతర గ్రహాలు, ఈ గ్రహ వ్యవస్థకు కేంద్ర బిందువైన సూర్యుడు మొదలైన విశ్వంతరాళపు వస్తువులపై అన్వేషణ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో సౌరశక్తికి సంబంధించిన పరిశోధన కీలకాంశంగా మారింది. అటువంటి సౌరవిజ్ఞాన శాస్త్రంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరమేశ్వరన్ వెంకటకృష్ణన్ 2025 ఏప్రిల్ 12న బెంగళూరులో కన్నుమూశారు.సౌరగోళంలో ఉండే అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి ఆయన చేసిన పరిశోధనకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం లభించింది. సౌర భౌతిక శాస్త్రాభివృద్ధికి కృషి చేయడం తన ఆకాంక్ష అని, తద్వారా సూర్యగోళంలో జరిగే నిరంతర ప్రక్రియలకూ, క్లైమేట్ చేంజ్‌కు సంబంధం ఉందా, ఉంటే ఏమేరకు ఉందని అన్వేషించాలనే తపనతో వెంకట కృష్ణన్ పరిశోధనా కృషి సాగింది.

తిరువనంతపురంలోని యూనివర్శిటీ కాలేజ్‌లో 1969లో బిఎస్‌సి, 1974లో ఎంఎస్‌సి చేసిన తర్వాత వెంకటకృష్ణన్ కొడైకెనాల్‌లోని సోలార్ అబ్జర్వేటరీలో ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఈ ఉద్యోగం చేస్తూనే మరోవైపు పరిశోధనా పట్టా గడించి ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఎ)లోనే ప్రొఫెసరయ్యారు. 1971లో బెంగళూరులో మొదలైన ఐఐఎ సంస్థకు బీజాలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనేపడ్డాయి. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పరిశోధనా సంస్థలో వైనూ బాపు, వినోద్ కృష్ణన్, అన్నపూర్ణీ సుబ్రమణ్యం వంటి శాస్త్రవేత్తలు పనిచేశారు. కొడైకెనాల్‌తోపాటు కావులూర్, గౌరీబిదనూర్, హన్లి, హొస్కోటెలలో ప్రయోగశాలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థకున్నాయి. తర్వాత 1999 నుంచి 2015 దాకా వెంకటకృష్ణన్ ఉదయపూర్ సోలార్ అబ్జర్వేటరీలో పనిచేసిన కాలంలో సాధించిన కృషి భారతదేశానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపును సాధించింది. హైరెజుల్యూన్ సోలార్ టెలిస్కోప్‌గా పిలువబడిన 50 సెంటీమీటర్ల మల్టీఅప్లికేషన్ సోలార్ టెలిస్కోప్‌ను మనదేశంలో తొలిసారి నిర్మించడం వారు సాధించిన ఫలితాలలో ముఖ్యమైనది.దీనికి ఇస్రో అవార్డును తన బృందం గెలుచుకోవడం విశేషం. అలాగే సూర్యుడిని పరిశీలించేందుకు ఉన్న పద్ధతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ, మంచి పరిశోధనకు దారులు వేస్తూ వచ్చారు వెంకటకృష్ణన్.

భారతదేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనా ప్రణాళికలో వీరు నిర్వహించిన పాత్ర గణనీయమైంది. భారతదేశపు తొలి అంతరిక్షపు సోలార్ అబ్జర్వేటరీ ‘ఆదిత్య ఎల్ వన్’ (Aditya L1) సాకారం కావడంలో వీరు కీలక భూమిక వహించారు. పదవీవిరమణ చేసిన తర్వాత కూడా యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ సంబంధిత పరిశోధనలు మరింత ముందుకు తీసుకువెళ్లారు. సుమారు 100దాకా పరిశోధనాపత్రాలు గల వీరి నేతృత్వంలో 13 మంది పరిశోధన పట్టాలు గడించారు. ఎటువంటి పటాటోపం లేకుండా నమ్రతతో, ప్రేమతో పరిశోధక విద్యార్థులను, తోటి శాస్త్రవేత్తలను ఆదరించేవారు.

అంతర్జాతీయంగా మన దేశానికి ఎంతో గౌరవాన్ని అందించే పరిశోధనను చేస్తూనే సౌరవిజ్ఞానాన్ని అందరికీ పంచాలనే తపనతో 3 పాపులర్ సైన్స్ గ్రంథాలు కూడా వెలువరించారు. ‘డే స్టార్: ఎపి ఇన్ టూ ది వర్కింగ్స్ ఆఫ్ ది సన్’అనే పుస్తకం సూర్యగోళంలో అనునిత్యం జరిగే చర్యలు, వాటి ఫలితాలు, తద్వారా భూమి లోనయ్యే ప్రభావాలు.. మొదలైనవి సులువుగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం సాగుతుంది. రెండవ పుస్తకం పేరు ‘ఆఫ్ టు యాన్ ఎక్లిప్స్’. ఒక మహిళా సౌరఖగోళ శాస్త్రవేత్త తన మనవరాలును సూర్యగ్రహణాన్ని తిలకించడానికి వెళ్లడం సంబంధించి సాగే ఊహాత్మక కథనమిది. గ్రహణాలను ఎంత జాగ్రత్తగా చూడాలో చెబుతూనే, గ్రహణాలు ఆధారంగా అంతకుముందు భారతదేశంతో పాటు ఇతర ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ఏమిటో కూడా వివరిస్తారు. ‘యాన్ అమేజింగ్ స్టోరీ ఆఫ్ కూటాన్ ది ఫోటాన్’ కూడా సౌర విజ్ఞానానికి సంబంధించిన అవగాహన కలిగించే ఊహాత్మక కథనమే. 72 ఏళ్ల వయసులో పరమేశ్వరన్ వెంకటకృష్ణన్ కనుమూసినా; మరి ఎంతో మంది శాస్త్రవేత్తలు మనదేశంలో, ఇతర దేశాలలో కూడా అతని పరిశోధనారీతిని, సామర్ధ్యాన్ని గుర్తు చేసుకుంటూ మరింత ముందుకు కొనసాగుతూనే ఉంటారు.

డా నాగసూరి వేణుగోపాల్
94407 32392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News