Thursday, January 23, 2025

ఆడ శిశువును ‘అమ్మే’సింది

- Advertisement -
- Advertisement -

Sold 15-day-old baby girl by her mother

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని ఆవేశంతో తల్లిదండ్రులు రూ. 80వేలకు పసికందును విక్రయించిన ఘటన సోమవారం నాడు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మనువరాలి యోగక్షేమాలను తెలుసుకునేందుకు వెళ్లిన అమ్మమ్మకు పసికందును ఆశా వర్కర్ సహాయంతో విక్రయించిన విషయం వెలుగుచూసింది. ఈక్రమంలో 15 రోజుల ఆడశిశువును అమ్మేసిన కుమార్తె దుర్గప్రియ, అల్లుడు శ్రీనివాస్, ఆశావర్కర్ బాషమ్మ, పాపను కొనుగోలు చేసిన కవితపై పసికందు అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో పురిటిబిడ్డను విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. వనస్థలిపురానికి చెందిన దుర్గాప్రియ గత నెల 21వ తేదీన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇదివరలో రెండు కాన్పులలోనూ దుర్గాప్రియకు ఇదివరకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఈ నేపథ్యంలో మూడవకాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడం దంపతులు నిరాశకు గురికావడంతో పాటు ఆవేశానికి లోనయ్యారు.

వనస్థలిపురంలో నివాసముంటున్న దుర్గప్రియ కాన్పు సమయంలో ఆమె తల్లి ఆంధ్రప్రదేశ్‌లోని అలూరుకు చెందిన బాలగోని రాజేశ్వరి సేవలు చేసింది. తన కూతురు దుర్గప్రియ డెలివరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ కావడంతో బాలగోని రాజేశ్వరి తిరిగి తన సొంతూరు ఆలూరుకు వెళ్లిపోయింది. ఈక్రమంలో తన మనుమరాలు ఎలా ఉందని అమ్మమ్మ రాజేశ్వరి పలుమార్లు కూతురిని అడిగింది. కూతురు ఫోన్‌లో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అల్లుడికి ఫోన్ చేసింది. దీంతో వారిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన రాజేశ్వరి ఈ నెల 6వ తేదీన నేరుగా వనస్థలిపురంలోని తన కుమార్తె దుర్గప్రియ ఇంటికి వచ్చి తన మనుమరాలు ఎక్కడని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా తన మనుమరాలిని ఏం చేశారని నిలదీయడంతో బాలానగర్‌కు చెందిన కవిత అనే మహిళకు రూ.80,000లకు విక్రయించామని వివరించారు.

తన మనుమరాలిని విక్రయించిన కూతురు,అల్లుడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జరిగిన విషయాన్ని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆడశిశువును కొనుగోలు చేసిన కవిత, విక్రయానికి సహకరించడంతో పాటు మధ్యవర్తిత్వం వహించిన ఆశా వర్కర్ భాషమ్మ, బాలిక తల్లిదండ్రులు దుర్గప్రియ,శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు. మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతో 15 రోజుల ఆడశిశువును రూ.80 వేల రూపాయలకు అమ్మేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పిల్లలు లేని తన చెల్లికి ఆశావర్కర్ భాషమ్మ సహాయంతో కవిత పాపను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.దీంతో పోలీసులు 15 రోజుల శిశువును చైల్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News