సొలిసిటర్ జనరల్‌పై బఘేల్ ఆగ్రహం
రాయపూర్/న్యూఢిల్లీ: రాజకీయ దురుద్దేశాలతో తనను అప్రతిష్ట పాల్జేయడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనపై సుప్రీంకోర్టులో తప్పుడు, మోసపూరిత ఆరోపణలు చేస్తున్నారంటూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ శుక్రవారం ఆరోపించారు. రాజకీయంగా తనకు ఉన్న ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని తగిన విధంగా తిప్పికొడతానని బఘేల్ తెలిపారు. నాగ్రిక్ అపూర్తి నిగమ్(ఎన్‌ఎఎన్) కుంభకోణానికి సంబంధించిన పిఎంఎల్‌ఎ కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల ఇడి తరఫున సొలిసిటర్ జనరల్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కొందరు నిందితులకు బెయిల్ రావడానికి రెండు రోజుల ముందు హై కోర్టు జడ్జి ముఖ్యమంత్రి బఘేల్‌ను కలుసుకున్నారంటూ బఘేల్ ముఖ్య అనుచరుడు ఒకరు చెప్పినట్లు ఒక వాట్సాప్ చాట్‌ను ప్రస్తావించారు.
కాగా..హైకోర్టు న్యాయమూర్తి ఎవరినీ బఘేల్ కలుసుకోలేదని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. న్యాయమూర్తిని ముఖ్యమంత్రి కలిసి తీర్పును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారంటూ సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో చెప్పారని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బఘేల్ అన్నారు. దీన్ని ఎవరు చూశారంటూ కోర్టు ప్రశ్నిస్తే ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వాట్సాప్ చాట్ ద్వారా తెలిసిందని సొలిసిటర్ జనరల్ చెప్పారని, వినడానికి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందని బఘేల్ వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టు ఎదుట ఒక ముఖ్యమంత్రి గురించి సొలిసిటర్ జనరల్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.