Saturday, November 23, 2024

ఆదర్శప్రాయుడు సోలిపేట

- Advertisement -
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు, భారత చైనా మిత్రమండలి జాతీయ నాయకులు సోలిపేట రామ చంద్రారెడ్డి మరణం పట్ల ఒ.పి.డి.ఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియ చేస్తున్నది. అధికార రాజకీయాలలో వుంటూ కూడా అత్యున్నతమైన రాజకీయ, మానవీయ విలువలకు కట్టుబడి ఆదర్శవంతమైన జీవితం గడిపిన నాయకుడు. జీవితాంతం ప్రజాస్వామ్య విలువల కోసం తపించి పాటు పడిన వాడు, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలమై, వెర్రితలలు వేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి హానికరంగా మారిందని భావించి గత పదిహేను సంవత్సరాలుగా అధికార పార్టీల రాజకీయాలకు దూరమైన వాడు. అదే సమయంలో ప్రజా విప్లవ రాజకీయాలకు సన్నిహితంగా వచ్చి ప్రజలతో మమేకమైనవాడు. ఈ దేశం లో ప్రజాస్వామ్యం కుర్చీ కొట్లాటలకూ, ఓట్ల రాజకీయాలకు పరిమితమైపోయిందని, నిజమైన ప్రజా రాజ్యం నెలకొనలేదని భావించే వారు.

ప్రజలకు, ముఖ్యంగా బడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలకు కుల, మతాలకతీతంగా అన్ని ప్రజాతంత్ర హక్కులు అమలు కావాలని పోరాడిన వాడు, దేశంలో పెరిగిపోతున్న మతాధిక్య రాజకీయాలను నిరసించినవాడు. పోడు రైతులకు గిరిజన, గిరిజనేతరులన్న భేదం లేకుండా సాగుపై ఆధారపడి బతుకుతున్న వారికి ఆ భూమిపై యాజమాన్య హక్కు, పట్టాలు లభించాలని గొంతెత్తి నినదించిన వాడు, ప్రజా స్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ కార్యక్రమాలతో కలిసి నడిచిన వాడు, సంస్థ నిర్వహించిన కొన్ని నిజ నిర్ధారణ కమిటీలకు సారధ్యం వహించినవాడు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ మసీదుపురంలో జరిపిన రాష్ట్ర మహా సభల నుండి 2023 లో హుస్నాబాదులో జరిగిన గ్రామీణ పేదల సంఘం మహా సభల వరకు పాల్గొని ఉత్తేజకరమైన సందేశాలు ఇచ్చిన నేత.

పేద ప్రజల సంఘాల నాయకులకు, సభ్యులకు ఆత్మీయంగా అండదండలు అందించిన ఈ జనప్రియ నేతకు మా విప్లవ జోహార్లు. వయసును, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ఈ సంస్థలలో పట్టుదలగా పాల్గొని యువకులకు స్ఫూర్తి నిచ్చిన తేజోమూర్తి. ప్రజాతంత్ర ఉద్యమాలకు విప్లవ చైతన్యం కల్పించి నిజాయితీతో ప్రజాస్వామ్య శక్తులన్ని ఐక్యం కావాలని, బలమైన ఉద్యమాలను నిర్మించాలని అభిలషిస్తూ వయోధిక్యాన్ని అధిగమిస్తూ ఓపిక చేసుకుని ఉద్యమసంస్థల కార్యక్రమాలలో శక్తి మేరకు పాల్గొనేవారు. ఆ సంస్థలతో సంబంధాలు కడకంటా నిలబెట్టుకుని కృషి చేసిన చైతన్య శీలి రామచంద్రా రెడ్డి జీవితం ఆదర్శప్రాయం. విద్యార్థి ఉద్యమాలు, గ్రామీణ పేదల సంఘం కార్యక్రమాలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉద్యమాలు ఆయనకు నిత్యకృత్యాలయ్యాయి.

Also Read: బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది?… ఎలా నివారించాలి?

ఖమ్మంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ మహాసభలలో పాల్గొని ఆయన తెలుగు జాతి ఐక్యతను కోరుతూ, తెలంగాణలో విభజనోద్యమాలకు సమైక్య రాష్ట్ర పాలకులదే బాధ్యత, వారు తమ విధానాలతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఐక్యతను పెంపొందించలేకపోయారని, అలాగే రాష్ట్ర విభజన ఈనాటి సమస్యలను పరిష్కరించ లేదని, ఆనాటి రాజకీయాలకి భిన్నమైన వాదనలు వినిపించారు. సోషలిజం, కమ్యూనిజం పట్ల విద్యార్థి జీవితంలోనే ఆకర్షితులై చివరి వరకు ఆ దీప్తిని నిలబెట్టుకున్న నాయకుడు. అమెరికా అగ్ర రాజ్య దురహంకారానికి వ్యతిరేకంగా భారత దేశం నిలవాలని, చైనా వంటి సోషలిస్టు శక్తులతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలని అనేక సభలలో ఉద్ఘాటించినవాడు. గ్రామీణ పేదల సంఘమైనా ఒపిడిఆర్ సభలైనా, ఢిల్లీలో మిత్రమండలి సభలైనా, హైదరాబాదులో జాతీయ మహా సభలైనా విప్లవోత్సాహంతో, నిబద్ధతతో పాల్గొని ఉత్తేజం కలిగించే వారు, తన మద్దతు తెలిపేవారు కా.తరిమేల నాగిరెడ్డి, కా.దేవుల పల్లి వంటి మేధావుల విప్లవోద్యమ రచనలు చదివి, ఆసక్తితో చర్చించే వారు. ఆయన నిత్య చదువరి. ఆచరణవాది. ఆ ప్రజాస్వామ్యవాదికి మా హృదయపూర్వక జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆశయాలను సఫలం చేయటానికి ప్రతిన పూనుదాం.

డా. జతిన్ కుమార్ (ఉపాధ్యక్షులు), డి.విజయేందర్ (ప్రధాన కార్యదర్శి) ఒపిడిఆర్ తెలంగాణ రాష్ట్రం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News