గన్‌ఫౌండ్రీ: జలమండలి నుండి అందిన రెండున్నర కోట్ల రూపాయల నిధులతో హిమాయత్‌నగర్‌లో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న డ్రైనేజీ, త్రాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నామని హిమాయత్‌నగర్ జలమండలి జీఎం రామకృష్ణ వెల్లడించారు. ఈమేరకు గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ చొరతవతో వాటర్ బోర్డు నుండి హిమాయత్‌నగర్ డివిజన్‌లోని ప్రజల సంక్షేమం కోసం ఈ నిధులను ముంజూరు చేయించారని అన్నారు.
డివిజన్‌లో పరిష్కారం కాకుండా ఉన్న మొండి డ్రైనేజీ సమస్యలను గుర్తించామని అన్నారు. మరో కొద్ది రోజుల్లోనే పనులను ప్రారంభించి డ్రైనేజీ సమస్యలకు చెక్‌పెట్టనున్నామని తెలిపారు.రామ్‌కోఠి,దత్తాత్రేయనగర్, విఠల్‌వాడి, శంశీర్‌బాగ్, మల్లికార్జున నగర్ మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అంధించిన నిధులతో హిమాయత్‌నగర్‌లో ప్రజలను ఎంతో కాలంగా వేదిస్తున్న సీవరేజీ చిక్కు సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నామని అన్నారు. డివిజన్‌లో జలమండలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటే ప్రజలు తమ పన్నులు, బకాయిలను సక్రమంగా చెల్లించాలని ఈ సందర్భంగా జీఎం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.