కరెక్షన్ మాడ్యూల్‌ను రూపొందిస్తున్న పురపాలక శాఖ
త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రెరాలతో డేటా అనుసంధానం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టిఎస్ బిపాస్‌ను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టిఎస్ బిపాస్ పోర్టల్‌లో మార్పులు చేస్తోంది. మార్పులు, చేర్పులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఫోన్ నెంబర్‌లతో పాటు సోషల్‌మీడియా ఖాతాలను పురపాలక శాఖ రూపొందించింది. ఎలాంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా వాటిని ప్రజలు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకురావడానికి సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్‌ను పురపాలక శాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తుండడంతో ప్రత్యేక సోషల్‌మీడియా ఖాతాలను తెరిచారు. వాటిపై ప్రజలకు విస్తృత ప్రచారాన్ని కల్పించేలా పురపాలక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.
తప్పులుంటే మార్పులు చేసుకునేందుకు వీలు లేక
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు, లే ఔట్లకు సులభంగా అనుమతులిచ్చేందుకు తెచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టిఎస్ బిపాస్)ను మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. టిఎస్ బిపాస్ పోర్టల్లో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో జాప్యం నెలకొంటున్నట్టున్నాయని దరఖాస్తుదారుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్‌లైన్ వివరాలు నమోదు చేసే సందర్భంలో ఊర్ల పేర్లు కనబడటం లేదని, అన్ని వివరాలు పొందుపరిచినప్పటికీ చాలా దరఖాస్తులకు మోక్షం దక్కడం లేదని దరఖాస్తుదారులు అధికారుల ఎదుట వాపోతున్నారు. మరోవైపు ఇళ్ల యజమానులు దరఖాస్తులో పొందు పరిచిన వివరాల్లో తప్పులుంటే మార్పులు చేసుకునేందుకు వీలు లేకపోవడంతో అందులో కొన్ని తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేలా కరెక్షన్ మాడ్యూల్‌ను పురపాలక శాఖ రూపొందించింది.
ఇక నుంచి టిఎస్ బిపాస్ ద్వారానే రెరా అనుమతి!
అలాగే బహుళ అంతస్తుల నిర్మాణదారులు పురపాలక శాఖ అనుమతితో పాటు రెరా అనుమతి పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. బహుళ అంతస్తులు నిర్మించే వారు తగిన ధ్రువపత్రాలు జత చేసి టిఎస్ బిపాస్‌కు దరఖాస్తు చేసుకుంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అనుమతి కూడా వచ్చేలా కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. బిపాన్ ద్వారా అనుమతులు పొందుతున్న నిర్మాణదారులు రెరా నుంచి వేరేగా అనుమతి పొందాల్సి ఉంటోంది. అయితే కొంతమంది రెరా అనుమతి తీసుకోవడం లేదు. ఇక నుంచి టిఎస్ బిపాస్ ద్వారా రెరా అనుమతి సదుపాయం కల్పిస్తే ఎక్కువ మంది అనుమతిపొందే అవకాశం ఉంటుందని పురపాలక శాఖ భావిస్తోంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డేటాను టిఎస్ బిపాస్, టిడిఆర్, రెరాతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే నంబర్ నమోదు చేయగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డేటా లోని వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీంతో పూర్తిస్థాయిలో అన్ని అనుమతులు ఒకే వేదికపై ఇచ్చేలా పురపాలక శాఖ తగిన కసరత్తు చేస్తోంది.
సోషల్ మీడియా ఖాతాలు
ప్రజలు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు, సమాచారం కోసమైనా సంప్రదించాలని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల్లు నిర్మించిన వారి గురించి ఈ నంబర్‌లలో సమాచారం ఇస్తే వాటిని పరిశీలించిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. ట్విట్టర్ @ts_bpass, ఇన్‌స్టాగ్రాం @ts_bpass, యూట్యూబ్ @ts_bpass, ఫేస్‌బుక్ @official tsbpass, వెబ్‌సైట్ https://tsbpass.telangana.gov.in/, మొయిల్ ఐడీ: ts-bpass-support@telangana.gov.in, టోల్‌ఫ్రీ నం. 18005992266, ల్యాండ్ లైన్ ఫోన్: 040-22666666, వాట్సప్ నంబర్ 9392215407లలో సంప్రదించాలని పురపాలక శాఖ అధికారులు తెలిపారు.