న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలోఉన్న ఎన్డీయే కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నేతృత్వం లోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, దానిలోని కొందరు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈమేరకు ఆయన మాట్లాడారు. అయితే ఎవరు తమతో టచ్‌లో ఉన్నారో ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. “ మోడీ నేతృత్వం లోని కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉంది. అది బలహీనంగా ఉండడంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు” అని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల వేళ మోడీ చేసిన ప్రసంగాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. “మీరు విద్వేషాన్ని వ్యాప్తి చేసి , దాని ఫలితాలను పొంది ఉండొచ్చు.
అయితే ఈసారి ఆ ఆలోచనలను ప్రజలు తిరస్కరించారు. ఎటువంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే, విపక్ష ఇండియా కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో మేం పోరాడాం. అలాంటి సమయాల్లో ఏం చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసు” అని అన్నారు. ఈసారి బీజేపీ 240 సీట్లు మాత్రమే దక్కించుకోవడంతో ఎన్డీయే కూటమి పక్షాలపై ఆధారపడక తప్పలేదు. మరోవైపు కాంగ్రెస్ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈసారి 99 స్థానాలు దక్కించుకుంది. ఇంటియా కూటమి పార్టీలకు 230 కి పైగా సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ నుంచి స్పందన వచ్చింది.