నేరుగా పోర్న్ వీడియోలను ప్రసారం చేస్తున్నాయి
ఒటిటి ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
శుక్రవారంలోగా ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను సమర్పించాలని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ: కొన్ని ఒటిటి ప్లాట్‌ఫామ్‌లు పోర్నోగ్రఫీ కంటెంట్‌ను నేరుగా ప్రసారం చేస్తున్నాయని, కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా ‘తాండవ్’లో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై తొలుత అలహాబాద్ హైకోర్టు తాండవ్ మేకర్స్‌కి, అమెజాన్ ప్రైమ్ ఉన్నతోద్యోగి అపర్ణ పురోహిత్‌కు నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ అశోక్‌భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడడం సర్వసాధారణమైంది. కొన్ని ఒటిటి ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్‌గా పోర్న్ కంటెంట్ ఉన్న వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తదుపరి విచారణను బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకన్నా ముందే కేంద్రం తాజాగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను కట్టడి చేసేందుకు విడుదల చేసిన మార్గదర్శకాలను తన ముందు ఉంచాలని బెంచ్ సొలిసిటనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. కాగా తన క్లయింట్ ‘తాండవ్’ వెబ్ సిరీస్ నిర్మాత కానీ, నటి కానీ కాదని, అయినప్పటికీ ఆమెను ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన దాదాపు పది కేసుల్లో నిందితురాలిని చేశారని, ఇది దిగ్భ్రాంతికరమని అపర్ణ పురోహిత్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు.
Some OTT Platforms show porn too says Supreme Court