రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పథకాలపై వివరించిన సిఎస్
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయమైన మార్పులు సాధించాం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పల్లెప్రగతి తదితర కార్యక్రమాలవల్ల రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి పధంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పధకాలను సమీక్షించేందుకై నగరానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్ర నాథ్ సిన్హా తో సోమవారం ఆయన భేటి అయ్యారు. ఈ సందర్బంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయమైన మార్పు వచ్చిందని అన్నారు. దీని ఫలితంగా గ్రీనరీపెరగడమే కాకుండా గత కొన్నేళ్లుగా వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతివనం, నర్సరీ, వైకుంఠ ధామం, కంపోస్ట్ యూనిట్, ట్రాక్టర్ ఉన్నాయన్నారు. గ్రామ పంచాయితీలకు ప్రతి నెలా రూ. 227 కోట్ల నిధులు అందచేస్తున్నామని వెల్లడించారు.
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందుగా కేవలం 8684 గ్రామ పంచాయితీలు మాత్రం ఉండేవని, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రతి గిరిజన తండా, గిరిజన గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. దీనితో గ్రామ పంచాయితీల సంఖ్య 12,769కి పెరిగాయని వివరించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపుకు తెలంగాణకు హరిత హారం పేరుతొ పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నామని, నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికే విధంగా సంబంధిత సర్పంచులు, కార్యదర్శులపై బాధ్యత పెట్టామని సిఎస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 19,472 గ్రామపంచాయితీల్లో మియావాకి పద్దతిలో ప్లాంటేషన్ చేపట్టామన్నారు. దీనికి అదనంగా కనీసం 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లె వనం చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 45 బృహత్ పల్లె వనాలను చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలో 47,70,428 సభ్యులుగల 4,39,648 స్వయం సహాయక మహిళా సంఘాలున్నాయని, వీరికి ప్రతి సంవత్సరం దాదాపు రూ.10వేల కోట్ల బ్యాంకు రుణాలు అందచేస్తున్నామని సిఎస్ పేర్కొన్నారు. ఈ మహిళా సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వివిధ ఆదాయ పెంపు పథకాలు వర్తింపచేస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ తదితర పధకాలను సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిపథకాల అమలును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. కాగా రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పధకాల పట్ల కేంద్ర కార్యదర్శి నరేంద్ర నాథ్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.