Friday, December 20, 2024

కేజ్రీవాల్‌పై పెద్ద కుట్ర..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదో జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను ఏదో విధంగా కేసులలో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు జైలుపాలయిన ఈ ఆప్ ఎంపి అనుమానాలు వ్యక్తం చేశారు. శుక్రవారం సింగ్‌ను సంబంధిత కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆప్ నేత వ్యాఖ్యల సంబంధిత వీడియోను ఇప్పుడు ఆప్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో పొందుపర్చింది. తమ నేత కేజ్రీవాల్ చుట్టూ వలయం బిగిస్తున్నారు. ఆయనపై ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. కేవలం అరెస్టు ఒక్కటే కాదు. అంతకు మించి ఏదో ఒకటి ఆయనకు జరగనుంది. ఇందుకు కొందరు వ్యక్తులు పావులు కదిపారని సంజయ్ సింగ్ ఆరోపించారు.

అయితే దీనికి సంబంధించి వివరాలు తెలియచేయలేదు. ఆయన మాట్లాడుతున్న దశలోనే పోలీసు అధికారులు ఆయనను అక్కడి నుంచి తరలించారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి గత నెలలో సంజయ్ సింగ్ అరెస్టు జరిగింది. ఆయన నివాసంలో గంటల తరబడి సోదాల తరువాత అదుపులోకి తీసుకుని తరువాత జైలుకు తరలించారు. సంజయ్ సింగ్‌కు చాలా నెలల ముందే పార్టీ సీనియర్ మనీష్ సిసోడియా ఈ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. బెయిల్ నిరాకరణకు గురవుతూ వస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలోనే ఆప్ నేత కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఈ స్కామ్‌కు సంబంధించి సమన్లు వెలువరించింది. అయితే మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఈ సమన్లు అర్థరహితం అని, ఇవి కేవలం రాజకీయ దురుద్ధేశాలతో కూడుకున్నవని పేర్కొంటూ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ దశలోనే కేజ్రీవాల్‌కు ముప్పు ఉందని పార్టీ సహ నేత ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News