వృద్దాప్యంలో మా బాగోగులు చూడని కొడుకు పై చర్యలు తీసుకోండి
ప్రజావాణి లో ఓ వృద్ధురాలి వేడుకోలు
స్పందించిన జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి
నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ కు కలెక్టర్ ఆదేశం
వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తేలితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత కుమారులదే : జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి
సిద్దిపేట: ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులపై తనయుడు దాడి చేసి హింసించిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బోల్లం కనుకమ్మ ( 65 సంవత్సరాలు), భర్త ధర్మపురి (73 సంవత్సరాలు) అనే దంపతులు సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు పెద్ద కొడుకు గణేష్, చిన్న కొడుకు సుదర్శన్ లు ఉన్నారు.
50 సంవత్సరాలు పిల్లల ఉన్నత స్థితికి కష్టపడి పని చేశారు, పూర్వీకుల ఆస్తుల ను కాపాడుకుంటూనే.. స్వంతంగా అనేక వ్యాపారాలు నిర్వహించి వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కొడుకుల కోసం సంపాదించి పెట్టారు. ఇప్పటికే కొన్ని ఆస్తులు కొడుకుల పేరున రాసిచ్చారు. వృద్దాప్యంలో ఉండడంతో ఆ దంపతులు ప్రస్తుతం వ్యాపారాలను నిర్వహించలేకపోతున్నారు.
ఇప్పటికీ కొడుకులతో కలిసి నివసిస్తునున్నారు. వ్యాపార, వ్యవసాయ లావాదేవీలు , కుటుంబ వ్యవహారాలు అన్ని ఉమ్మడిగానే నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఉమ్మడి గా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, ప్లాట్ లు , వ్యాపార లావాదేవీలు తనకే దక్కాలని తన చిన్న కొడుకు సుదర్శన్ తమను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు.
కనిపెంచిన తల్లి దండ్రులు అని చూడకుండా భౌతిక దాడులకు తెగబడ్డాడు. ఈ విషయం పై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒక కోటి 20 లక్షల ను కూడ చిన్న కొడుకు సుదర్శన్ కు ఇచ్చామని, అప్పటికి సంతృప్తి చెందకుండా ఉమ్మడి ఆస్తుల ను కాజేయాలని చూస్తున్నాడు. భౌతిక దాడులు చేస్తూ… తమను సహకరించ పోతే అంతం చేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. వృద్ధులైన తాము దిక్కు తోచని స్థితిలో ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతము పెద్ద కుమారుడు గణేష్ సంరక్షణలో ఉన్నామని తెలియజేశారు. మా సంరక్షణ, బాగోగులు చూడకుండా భౌతిక దాడులు చేస్తూ వృద్దాప్యంలో మానసిక క్షోభకు గురి చేస్తున్న చిన్న కొడుకు సుదర్శన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట పట్టణం భారత్ నగర్ కు చెందిన బోల్లం కనుకమ్మ ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి నీ కలిసి వేడుకుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించారు. వృద్ధురాలి ఫిర్యాదు ఆధారంగా వెంటనే చిన్న కొడుకు సుదర్శన్ కు నోటీస్ లు జారీ చేయాలనీ సిద్దిపేట ఆర్ డిఒ అనంత రెడ్డికి ఆదేశించారు. ‘‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ -2007 చట్టం లోని నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యుడిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ పిల్లలదే
వృద్ధ తల్లిదండ్రుల భద్రత, సంరక్షణతో పాటు వారి పట్ల గౌరవంగా మసులుకోవాల్సిన బాధ్యత వారి కుటుంబాల్లోని పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. నేటి సమాజంలో రోజురోజుకీ నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను పిల్లలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలు, తమ చిన్న కొడుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కన్నబిడ్డలపై ఫిర్యాదు చేయడం తనను ఎంతగానో బాధించిందన్నారు. అయితే ఇలాంటి వృద్ధ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందుకోసం సంరక్షణ పోషణ చట్టంను పకడ్బందీగా అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ‘‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ -2007 చట్టం’’. ఇది తల్లిదండ్రులు, వయోధికుల సంరక్షణను విస్మరించిన వారిపై కొరడా ఝుళిపిస్తోందన్నారు.