గోల్కొండ పిఎస్ పరిధిలో సంఘటన
కుటుంబ కలహాలే కారణం
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్: పాతకక్ష్యల కారణంగా సోదరుడి మామను హత్య చేసిన సంఘటన నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… టోలీచౌకి, నదీం కాలనీకి చెందిన సయిద్ జిలానీ(50) కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే పనికి వెళ్లిన బాధితుడు ఇంటికి వస్తున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆర్టిసి బస్సులో వచ్చిన బాధితుడు ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ఇమ్రాన్ మరికొంత మంది కలిసి కత్తితో పొడిచి చంపివేశారు. చాలా సమయం అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో బాధితుడి భార్య ఫర్జానా బేగం రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసింది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే వ్యక్తి మాట్లాడాడు.
దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు తన కుమార్తెను తీసుకుని వెళ్లే సరికి సయిద్ జిలానీ మహబూబ్ గార్డెన్ సమీపంలో రక్తం మడుగులో పడి ఉన్నాడు. తనకు వరుసక అల్లుడు అవనున్న షేక్ ఇమ్రాన్ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేసింది. వారికి తమ కుటుంబ సభ్యులకు పాతకక్షలు ఉన్నాయని బాధితురాలు చెప్పింది. వెంటనే గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడికి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.