హైదరాబాద్: నగరంలోని ఇసిఐఎల్ వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన అక్కడి వారిని భయాందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45)కి సాయికుమార్(25) అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు కలిసి ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. అయితే మొగిలి రోజు తాగి ఇంటికి వచ్చి గొడవ చేయడాన్ని సాయికుమార్ భరించలేకపోయాడు.
దీంతో శనివారం లాలాపేట నుంచి బస్సులో బయలుదేరిన తండ్రిని సాయికుమార్ బైక్‌పై అనుసరించాడు. ఇసిఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే తనతో తెచ్చుకున్న చాకుతో అతనిపై 10-15 సార్లు పొడిచాడు. ఇది గమనించిన స్థానికులు మొగిలిని వెంటనే శ్రీకర ఆస్పత్రికి తరలించగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగదాలే హత్య చేసేందుకు కారణమని పోలీసులు తెలిపారు.