ఖమ్మం జిల్లా, బోనకల్ మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో రంజాన్ పండుగ రోజు ఓ ముస్లిం కుటుంబంలో తండ్రి, తనయుల మృతితో విషాదం నెలకొంది. తమ ఇంటిపక్కనే ఉన్న ఊర చెరువు వారి పాలిట మృత్యుకౌగిలిగా మారి వారిద్దరిని బలితీసుకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఊర చెరువు పక్కనే పఠాన్ ఇసూబ్ ఖాన్ (75) ఇల్లు నిర్మించుకొని కాపురం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఖమ్మంలో ఉంటుండగా రెండో కుమారుడు కరీముల్లాఖాన్ తండ్రితో ఉంటున్నాడు. రంజాన్ పండుగ సందర్బంగా జరిగిన నమాజ్‌కు తండ్రీతనయులు వెళ్ళివచ్చారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల సమయంలో మానసికస్థితి సరిగ్గాలేని తండ్రి గేటు తీసుకొని చెరువులోకి దిగాడు.
ఈత రాని తన తండ్రి చెరువులోని పెద్ద గుంతలో దిగటంతో గమనించిన తనయుడు కరీముల్లా ఖాన్ (45) తండ్రిని కాపాడే ప్రయత్నంలో కాలు జారి తండ్రి పడిన గుంతలోనే పడి మృతి చెందాడు. నిత్యం జనం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఈ ఇద్దరు చెరువు గుంతలో పడిన విషయాన్ని బోనకల్ నుండి రాయన్నపేట వెళ్లే ఓ మహిళ చూసి కేకలు వేసింది. అదే గ్రామానికి చెందిన కాలసాని అయితం, మరీదు వీరబాబు అనే యువకులు చెరువులోకి దిగి తండ్రీ కొడుకులను బయటకు తీసుకువచ్చారు. ప్రాణంతో ఉన్నారేమోనని ప్రయత్నించిన గ్రామస్థులకు నిరాశే ఎదురైంది. అప్పటికే వారిద్దరూ మృతి చెందటంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది.
ఇప్పటికి ఐదుగురిని బలికొన్న ఊరచెరువు
గ్రామానికి పడమర దిక్కులో ఊరు పక్కనే ఉన్న చెరువు కొందరు స్వార్ధ పరుల కారణంగా మృత్యు కౌగిలిగా తయారైంది. గతంలో ఎప్పడూ లేనివిధంగా చెరువులోని మట్టిని కొందరు గ్రామానికి చెందిన స్వార్ధ పరులు వేల ట్రిప్పులు అమ్ముకొన్నారు. గత సంవత్సరం రెండు నెలలపాటు ఈ మట్టి తరలింపు తతంగం పూర్తిగా అధికారులు అండదండలతో కొనసాగింది. అవినీతి అధికారులు కారణంగా బరితెగించిన కొందరు చెరువులోని మట్టిని సుమారు 20 అండుగులకు పైగా గుంతలు పెట్టి తవ్వి అమ్ముకొన్నారు. దీంతో నీటితో నిండినప్పుడు ఆ గుంతలు ప్రమాదకరంగా మారాయి.
ఇప్పటికి ఆ గుంతలు ఐదు నిండుప్రాణాలను బలితీసుకొన్నాయి. మట్టి తోలకాల సందర్భంగా గ్రామానికి చెందిన అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. గేదెలు చెరువులో ఉన్నాయని వాటిని తోలుకొచ్చేందుకు వెళ్లిన మరీదు కృష్ణ, బుంగ తిరపయ్య అనే ఇద్దరికి ఈత వచ్చినప్పటికీ లోతైన గుంతల కారణంగా మృత్యువాత పడ్డారు. పదిలం నాగరత్నం అనే మహిళ కూడా చెరువులో ప్రాణాలొదిలింది. ప్రస్తుతం ఇసూబ్, కరీముల్లాలతో మొత్తం ఐదుగురు చెరువులో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ఊర చెరువులో ప్రమాదాలను నివారించేందుకు చెరువుకు రోడ్డును ఆనుకొని గోడ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.