Saturday, April 19, 2025

ఆస్తి కోసం కుమారుడు కర్కషం

- Advertisement -
- Advertisement -

మాయమైపోతున్నాడమ్మా… మనిషన్న వాడు… మచ్చుకైన లేదు చూడు మానవత్వం అన్నవాడు అన్నాడు ఓ కవి… అక్షరాల నేటి సమాజంలో ఆర్ధిక సంబంధాల ముందు ప్రేమ సంబంధాలు, విలువలు మంట కలిసిపోతున్నాయి. అక్షరాల ఓ కొడుకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతో తండ్రి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని అమానుష సంఘటన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లెకు చెందిన మాణిక్యరావు(70) గతంలో సర్వేల్యాండ్ రికార్డ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి పదవి విరమణ పొందారు. ఆయనకు సొంత ఊరిలో 16 ఎకరాలు వ్యవసాయం పొలం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఇళ్లు ఉంది.

మాణిక్యరావుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గత కొంతకాలం క్రితం భార్య కన్నుమూసింది. ఈ నేపథ్యంలో సొంత ఊరిలో ఉన్న వ్యవసాయ పొలంతో పాటు రూ 60 లక్షల నగదును కుమారుడు గిరిష్‌కు రాసిచ్చి, ఆర్ధిక పరిస్థితులు బాగాలేక పోవడంతో మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని కూతురు రాజనందిని పేరిట రిజిస్టర్ చేయించి ఇచ్చారు. కుమారుడు గిరిష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా మాణిక్యరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కూతురు ఇంటిలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని కూతుళ్లు తమ తమ్ముడైన గిరీష్‌కు సమాచారం ఇచ్చారు. హైందవ సాంప్రదాయ ప్రకారం కర్మకాండలు నిర్వహించాల్సిన కుమారుడు తండ్రి మరణ సమచారం ఇచ్చినా రానని తెగేసి చెప్పాడు. మహబూబ్ నగర్‌లో ఉన్న ఇంటిని తన పేరిట రిజిస్టర్ చేస్తే వస్తానని సమాధానం చెప్పారు.

ఇళ్లు రాసిస్తానని అంత్యక్రియలు జరపాలని కూతుళ్లు తమ్ముడు గిరిష్‌కు సమాచారం ఇచ్చినా హాజరు కాలేదు. బంధువులు, కాలనీవాసులు కూడా గిరిష్‌కు రావాలని అభ్యర్ధించినా కర్కష కుమారుడికి గుండొ కరగలేదు. ఈ నేపథ్యంలో సిటిజన్స్ ఫోరం సభ్యులు నీవు రాకపోతే మేము అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పానా రానని తెగేసి చెప్పాడు. దీంతో చిన్న కూతురు రఘునందిని ముందుకు వచ్చి తన తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహిస్తానని ముందుకు వచ్చింది. తండ్రి అంతిమ యాత్ర ముందు నడిచి స్మశానంలో అన్ని తానై తండ్రి అంత్యక్రియలను జరిపించింది. తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యం ఇచ్చిన కుమారుడు పట్ట సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News