పణజీ : టిక్‌టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ (42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ ఆదివారం తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తనతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడినట్టు వెల్లడించారు. లోతైన విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. ఫోగాట్ కుటుంబం సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా తనతో ప్రస్తావించారన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత కేసును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని తెలిపారు. ఇప్పటికే గోవా పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారని పేర్కొన్నారు.
గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ గత సోమవారం అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టమ్ నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని అదే ఆమె మరణానికి దారి తీసిందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్యాన్, సుఖ్వీందర్ సహా ఇప్పటివరకు మొత్తం 10 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.