న్యూఢిల్లీ: సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధించిన ఆరోగ్య అప్‌డేట్‌ను పంచుకుంటూ, శ్రీమతి గాంధీ ప్రస్తుతం శ్వాసకోశలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నారని , నాసికా ప్రక్రియ చేయించుకున్నారని కాంగ్రెస్ జూన్ 17న తెలియజేసింది.
ఒక ప్రకటనలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ, శ్రీమతి గాంధీ ప్రస్తుతం కోవిడ్ అనంతర లక్షణాల కోసం పరిశీలనలో ఉన్నారని తెలిపారు. “అడ్మిట్ అయిన తర్వాత ఆమె దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుగొనబడింది. ఆమె ప్రస్తుతం ఇతర పోస్ట్-కోవిడ్ లక్షణాల కోసం చికిత్స పొందుతోంది. ఆమెకు నిశిత పరిశీలన, చికిత్స కొనసాగుతోంది” అని ప్రకటనలో తెలిపారు.
‘నేషనల్ హెరాల్డ్’తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో 75 ఏళ్ల సోనియా గాంధీకి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆమెను జూన్ 8న ఈడి విచారించాల్సి ఉండింది. కానీ కోవిడ్ పాజిటివ్ కారణంగా తనను ప్రశ్నించేందుకు మరో తేదీని ఆమె కోరారు. ఈడి ప్రశ్నించడానికి జూన్ 23.. కొత్త తేదీ అయినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఆమె కార్యాలయం మరింత సమయం కోరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.