కొవిడ్‌పై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి: సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల దేశం కృంగుబాటుకు గురైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. తమ పౌరుల పట్ల శ్రద్ధలేని రాజకీయ నాయకత్వమే దేశ దీనిస్థితికి కారణమని ఆమె అన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సరైన దార్శనిత ఉన్న సమర్థ నాయకత్వం అవసరమని సోనియా అన్నారు. కొవిడ్ వల్ల ఏర్పడ్డ పరిస్థితిపై సమీక్షకు వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపరచలాని కేంద్రాన్ని ఆమె డిమాండ్ చేశారు. మహమ్మారిని సమైక్యంగా ఎదుర్కోగలమని దేశ ప్రజలకు స్థాయీ సంఘం హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో సోనియా శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి వైరస్‌పై ఐక్యంగా పోరాడాలని ఆమె ఈ సందర్భంగా తమ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పార్టీ ఎంపీలతో సోనియా నిర్వహించిన మొదటి సమావేశమిది. ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహపరిచాయని ఆమె అన్నారు. త్వరలోనే వర్కింగ్ కమిటీ సమావేశమై సమీక్షిస్తుందని తెలిపారు.