బిజెపిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శనాస్త్రాలు
న్యూఢిల్లీ: విభజన సిద్ధాంతాలతో విద్వేషాన్ని ఎగదోస్తూ దేశ దృఢమైన పునాదుల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. చరిత్రకు వక్రభాష్యం చెబుతూ గంగాజమునాలాంటి లౌకిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. మంగళవారం కాంగ్రెస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా తన వీడియో సందేశంలో బిజెపినుద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఈ విభజన సిద్ధాంతాలవారికి ఎలాంటి పాత్రా లేదని ఆమె అన్నారు. దేశ ప్రజల మధ్య శత్రుత్వభావాన్ని రగిలిస్తారు, భయాన్ని కలిగిస్తారు. నియంతల పాలన ఇప్పుడు సాగుతోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని వారు ఉల్లంఘిస్తున్నారని సోనియా విమర్శించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, భిన్నత్వంతో కూడిన సమాజానికి తమ సేవలు నిబద్ధతతో కొనసాగిస్తామని ఆమె అన్నారు. హిందూమత నేతలు కొందరు ఇటీవల మహాత్మాగాంధీపై విమర్శలు చేస్తూ, ఆయణ్ని హత్యగావించిన గాడ్సేను పొగుడుతున్న నేపథ్యంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.