బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం నుంచి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 10నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హుబ్బళ్లిలో రేపు సోనియాగాంధీ ర్యాలీలో పాల్గొని అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హుబళ్లిధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ సిఎం జగదీశ్ శెట్టర్ తరఫున సోనియా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాగా బిజెపి అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో శెట్టర్ కాంగ్రెస్‌లో చేరి హస్తంపార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జగదీశ్ శెట్టర్‌కు పోటీగా మహేశ్ టెంగింకైను బిజెపి మోహరించింది. ఈ స్థానాన్ని అధికార బిజెపితోపాటు కాంగ్రెస్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గెలుపు కోసం ఇరుపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
Also Read: గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్..
6వ తేదీ శనివారం హుబ్బళ్లి చేరుకుని ర్యాలీలో పాల్గొంటారు అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా ఉండటంతో ఆ పార్టీ నేతలు బిజెపి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు శనివారం ప్రధాని నరేంద్రమోడీ బెంగళూరులో 36.6కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించనున్నారు. 17అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా షో కొనసాగనుంది. మోడీ శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు 10.1కిలోమీటర్లు అనంతరం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ 26.5కిలోమీటర్లు పర్యటించనున్నారని బిజెపి నేతలు తెలిపారు. కాగా మే 8వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.