లోక్‌సభలో సోనియా గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభించిన దరిమిలా పాఠశాలల్లో నిలిపివేసిన మధాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో సోనియా గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్ల లోపు పిల్లలతోపాటు గర్భిణి మహిళలకు, బిడ్డలకు పాలిచ్చే తల్లులకు వేడిగా ఆహారాన్ని అందచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ కారణంగా అన్నిటి కన్నా ముందుగా పాఠశాలలు మూతపడ్డాయని, అన్నిటి కన్నా ఆలస్యంగా తెరుచుకున్నవి కూడా పాఠశాలలేనని ఆమె తెలిపారు.
భావి భారత న్పిల్లలు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె అన్నారు. పాఠశాలలు మూతపడిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం కూడా నిలిచిపోయిందని, జాతీయ ఆహార భద్రతా చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగానే ప్రజలకు ఉచితంగా రేషన్ లభించిందని సోనియా తెలిపారు. అయితే పిల్లలకు ఉడికించిన, పౌష్ఠికాహారానికి రేషన్ ప్రత్యామ్నాయం కాదని ఆమె చెప్పారు. ఇప్పుడు మళ్లీ పాఠశాలలు తెరచినందున పిల్లలకు పౌష్ఠికాహారం అందచేయవలసిన అవసరం ఉందని, కరోనా కారణంగా మధ్యలోనే చదువులు మానేసిన పిల్లలను తిరిగి స్కూళ్లకు రప్పించడానికి మధ్యాహ్న భోజనం ఉపయోగపడగలదని ఆమె అభిప్రాయపడ్డారు.