3 గంటలపాటు ప్రశ్నల పరంపర
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు బుధవారం వరుసగా మూడవరోజు 3 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె మళ్లీ తమ ఎదుట హాజరుకావాలన్న సంకేతాన్ని అందచేస్తూ సోనియా గాంధీకి తాజా సమన్లు ఏవీ ఇడి అధికారులు బుధవారం జారీచేయలేదు. మూడు రోజులపాటు ఆమెను 11 గంటలకు పైగా ఇడి ప్రశ్నించిందని, ఆమెకు దాదాపు 100 ప్రశ్నలు వేసిందని అధికారులు తెలిపారు. జులై 21న సోనియా గాంధీ మొదటి విడతగా ఇడి ఎదుట హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు కుమార్తె ప్రియాంక గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ వెంటరాగా సోనియా గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని ఇడి కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆమె ఇడి ఎదుట హాజరయ్యారు.
ప్రధాన దర్యాప్తు అధికారితోసహా దర్యాప్తు అధికారుల బృందం, సోనియా గాంధీ సమాధానాలను నమోదు చేసే వ్యక్తి ఆ గదిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తన తల్లికి ఏదైనా సహాయం కాని వైద్య అవసరాలు కాని అందచేసేందుకు ప్రియాంక గాంధీ ఇడి ప్రధాన కార్యాలయమైన ప్రవర్తన్ భవన్ వద్దనే ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు సోనియా గాంధీ ఇడి కార్యాలయాన్ని వీడారు. ఇలా ఉండగా&కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇడి కార్యాలయం హాజరు అవుతున్న సందర్భంగా ఆమె నివాసం జన్‌పథ్ నుంచి ఇడి కార్యాలయం వరకు ఒక కిలోమీటర్లు మార్గంలో సిఆర్‌పిఎఫ్, ఆర్‌ఎఎఫ్ సిబ్బందితో సహా భారీ బలగాలను ఢిల్లీ పోలీసులు మోహరించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.