రెండో దఫా విచారణకు రెడీ
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరుకావల్సి ఉంది. పలు అంశాలపై ఆమెను రెండోదఫా విచారణకు ఇడి పిలిపించింది. నిజానికి సోమవారం ఈ విచారణ జరగాల్సి ఉంది. కానీ దీనిని పలు కారణాలతో మంగళవారానికి మార్చారు. దీనితో ఆమె మంగళవారం మధ్యాహ్నం ఇడి ఎదుట విచారణకు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే ఈ విషయం నిర్థారణ కాలేదు. ఈ నెల 21న తొలిసారిగా ఆమెను రెండు గంటలకు పైగా విచారించారు. 28 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే విచారణ సాగించాల్సి ఉందని అధికారులు ఆమెకు తిరిగి విచారణ ఆదేశాలు వెలువరించారు.
మంగళవారం ఇంతకు ముందులాగానే అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ నడుమ ఇడి కార్యాలయంలో ఆమె విచారణ సాగుతుందని అధికారులు తెలిపారు. సోనియా నుంచి కొవిడ్ లేదనే సర్టిఫికెట్లు తీసుకుని విచారణాధికారులు ఆమెను తగు వైరస్ నివారణ జాగ్రత్తల నడుమ విచారిస్తారని వెల్లడైంది. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈసారి సోనియా వెంబడి ఇడి విచారణ దశలో ఉంటారని, ఆమెకు మందులు తీసుకోవడానికి సహకరిస్తారని నిర్థారణ అయింది. కేంద్రీయ దర్యాప్తు సంస్థ చర్యలు అనుచితంగా ఉన్నాయని, బిజెపి అధినాయకత్వపు కక్షసాధింపు రాజకీయ దురుద్ధేశపూరిత చర్యలకు ఇవి పరాకాష్ట అని కాంగ్రెస్ విమర్శించింది.