Friday, January 10, 2025

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2006 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గాన్ని తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించి తాను రాజ్యసభకు వెళ్లాలని సోనియా గాంధీ యోచిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయరాదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు వారు తెలిపారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీని నామినేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన రాయబరేలి నుంచి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా మొట్టమొదటిసారి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 77 సంవత్సరాల సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల్లో జైపూర్ నుంచి నామినేషన్ వేయనున్నట్లు వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ పరిణామాన్ని అధికార మార్పిడిగా పరిగణించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకునిపోవడం, గాంధీ కుటుంబానికి పుట్టినిల్లు లాంటి ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ గాంధీ సైతం ఓటమిపాలైన పరిస్థితులలో సైతం రాయబరేలి నుంచి సోనియా గాంధీ గెలుపొందడం విశేషం. ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాలపై కొన్ని దశాబ్దాలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తన తల్లి వరుసగా గెలుపొందుతున్న రాయబరేలి స్థానం ప్రియాంకకు సురక్షితమైన స్థానం కాగలదని భావిస్తున్నారు. 1950వ దశకం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉంది. మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీ తాతగారు ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 జనవరిలో లాంఛనంగా క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ అప్పటి ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేస్తారని ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగాయి.

అయితే ఉత్తర్ ప్రదేశ్‌లో పార్టీకి పునరుజ్జీవం కల్పించేందుకు ప్రియాంకను ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించిన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెను ఉత్తర్ ప్రదేశ్‌లోని తూర్పు భాగానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆ తర్వాత ఆమెను యావత్ ఉత్తర్ ప్రదేశ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే ఆ చర్యలు కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2022లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బిజెపి విజయ దుందుభి మోగించి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ సమయంలో ప్రియాంక గాంధీతో సమానంగా ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ భాగానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో దాదాపు కనుమరగయ్యే పరిస్థితి ఏర్పడింది. కాగా..జనాకర్షణ శక్తిగల నేతగా పేరు తెచ్చుకున్న ప్రియాంక గాంధీ అనేక సంవత్సరాలుగా రాయబరేలి ప్రజలకు తన తల్లి తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌స్భభ ఎన్నికల్లో రాయబరేలి నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసిన పక్షంలో దీని ప్రభావం యావత్ ఉత్తర్ ప్రదేశ్‌పైనే పడే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి దోహదపడగలదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News