Thursday, January 30, 2025

మన్మోహన్ మృతి నాకు ‘వ్యక్తిగత నష్టం’:సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిని తనకు ‘వ్యక్తిగత నష్టం’ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఆయన తనకు మిత్రుడు, తత్వవేత్త, మార్గదర్శకుడు అని, ఆయన మరణంతో పార్టీ విజ్ఞత, గొప్పతనం, వినయం మూర్తీభవించిన నేతను కోల్పోయిందని సోనియా పేర్కొన్నారు. సింగ్ మృతితో జాతీయ జీవనంలో ఎవ్వరూ భర్తీ చేయలేని లోటు ఏర్పడిందని సోనియా గాంధీ ఆయన మృతిపై సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో మేము, దేశ ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి నేతను కలిగి ఉన్నందుకు ఎన్నటికీ గర్విస్తుంటారు. కృతజ్ఞులై ఉంటారు. దేశ ప్రగతికి, అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనివి’ అని ఆమె అన్నారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో మేము విజ్ఞత. గొప్పతనం, వినయం మూర్తీభవించిన నేతను కోల్పోయాం.

ఆయన మనస్ఫూర్తిగా దేశానికి సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రియతమ మార్గదర్శక జ్యోతి అయిన సింగ్ దూరదృష్టి కోట్లాది మంది భారతీయుల జీవితాలకు సాధికారత చేకూర్చింది’ అని సోనియా పేర్కొన్నారు. సింగ్ నిష్కల్మష హృదయానికి దేశ ప్రజలు ఆయనను ప్రేమించారని సోనియా తెలిపారు. ఆయన సలహా, ‘విజ్ఞతతో కూడిన సూచనల’ను దేశంలో వివిధ రాజకీయ వర్గాల వారు ఆత్రుతగా కోరుతుంటారని, వాటికి ఎంతో విలువ ఇస్తుంటారని ఆమె తెలిపారు. ‘సాంఘిక న్యాయానికి, లౌకికతకు, ప్రజాస్వామ్య విలువలకు ఆయన నిబద్ధత ప్రగాఢమైనది, మొక్కవోనిది’ అని సోనియా అన్నారు. సిపిపి చైర్‌పర్సన్ సోనియా శుక్రవారం ఉదయం డాక్టర్ సింగ్ నివాసంలో ఆయన భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ప్రధానికి నివాళులు అర్పించేందుకుఏర్పాటైన సిడబ్లుసి సమావేశానికి కూడా ఆమె హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News