పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పార్లమెంట్ వెలుపల రాష్ట్రపతి ప్రసంగంపై అభిప్రాయం చెప్పాలని మీడియా సోనియాను కోరగా అందుకు ప్రతిస్పందన ‘పూర్ థింగ్. ప్రసంగం చివరికి వచ్చే వరకు రాష్ట్రపతి బాగా అలసిపోయారు’ అని వ్యాఖ్యానించారు. సోనియా వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
అదే సమయంలో రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకుని ‘బోరింగ్, నో కామెంట్స్, చెప్పిందే పదేపదే చెప్పారు’ అన్నారు. కాగా బిజెపి అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా దీనిపై ప్రతిస్పందిస్తూ ‘రాజ్యాంగపు అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి అవమానకర వ్యాఖ్య చేయడం ఆక్షేపణీయం’ అన్నారు. ఎఐసిసి చీఫ్ ఖర్గే స్పందిస్తూ సోనియా వ్యాఖ్యలను బిజెపి, ఆ పార్టీ అనుకూల మీడియా వక్రీకరించిందని తిప్పికొట్టారు.
మీడియా వక్రీకరించింది : ప్రియాంక
సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. తన తల్లికి రాష్ట్రపతిపై అపార గౌరవం ఉందని, కానీ మీడియానే ఆమె వ్యాఖ్యలను వక్రీకరించిందని అన్నారు. సోనియా గాంధీని క్షమాపణ కోరిన బిజెపి మీద ప్రియాంక విరుచుకుపడ్డారు. దేశాన్ని నాశనం చేస్తున్నందుకు బిజెపియే క్షమాపణ చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ కూడా ఈ విషయంలో బిజెపిని విమర్శించారు. ‘ సోనియా గాంధీకి రాష్ట్రపతి ఆరోగ్యంపై ఆందోళనే తప్ప అగౌరవం లేదు. దీనిని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది’ అన్నారు.