న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం కోసం శ్రీనగర్ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా జమ్మూ, కశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే చిక్కుపడి పోవడంతో మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా సోనియాగాంధీ కోసం కేటాయించిన ముందు వరస బెంచిలో ఆమె ఒక్కరే కూర్చుని ఉండడం కనిపించింది. సాధారణంగా పార్టీ సీనియర్ నేతలు ఆమెకు ఇరువైపులా ఉంటారు. అయితే పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలకు చెందిననేతలు ఆమెవద్దకు వచ్చి కుశల ప్రశ్నలు వేయడం కనిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌కూడా సోనియా గాంధీని పలకరించడం కనిపించింది.
సోనియాగాంధీకి దగ్గర్లో కూర్చున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆమె వైపు వంగి ఏదో మాట్లాడుతూ కనిపించారు. అయితే తన వెనుక వరసలో కూర్చున్న టిఎంసి రాజ్యసభ ఎంపి డెరిక్ ఒ బ్రియాన్‌తో సోనియా గాంధీ సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించడం విశేషం. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదని ఇంతకు ముందు టిఎంసి పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగించడానికి ముందు సోనియా, ఒ బ్రియాన్‌లు చాలా సేపు మాట్లాడుకోవడం విశేషం, కాగా రాజకీయ వైరాలను పక్కన పెట్టి డిఎంకె నేత టిఆర్ బాలు, అన్నా డిఎంకె నేత తంబిదురైలు ప్రధాని మోడీతో మాట్లాడడానికి ముందు పరస్పరం ఆలింగనం చేసుకోవడం విశేషం.