కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకం అయిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజిఎన్‌ఆర్‌ఈజిఏ)2005’ను బలహీనపరుస్తోందని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మంగళవారం రాజ్యసభలో అన్నారు. శూన్యకాలంలో ఈ ప్రస్తావనను లేవనెత్తి ఈ పథకం కింద కనీస వేతనాన్ని రోజుకు రూ. 400 చేయాలని, 150 రోజుల పనిదినాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పథకానికి కేటాయిస్తున్న మొత్తం రూ. 86,000 కోట్ల వద్దే స్తబ్ధుగా ఉండిపోయిందన్నారు.
ఇది జిడిపిలో 10 ఏళ్ల కనిష్ఠ శాతంలో ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు ఈ మొత్తం రూ. 4000 కోట్లు పడిపోయిందన్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఈజిఏ పథకం వేతనాలు రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడా కలిగి ఉందన్నారు. ఉత్తరాఖండ్‌లో రోజుకు రూ. 237గా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు రూ. 300గా ఉందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సోనియా గాంధీ జీరో అవర్‌లో ఓ అంశాన్ని లేవనెత్తడం అన్నది గత ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికయ్యాక ఇది రెండోసారి. జీరో అవర్‌లో ఓ అంశాన్ని లేవనెత్తాలంటే సభాధ్యక్షుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.