Sunday, January 19, 2025

రాజ్యసభకు సోనియా పోటీ

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా

జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శాసనసభ భవనంలో సోనియా గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న సమయంలో ఆమె సంతానం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పిసిసి అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, ప్రతిపక్ష నాయకుడు టికారామ్ జులీ ఆమె వెంట ఉన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే ముందు ఆమె అసెంబ్లీలోని ప్రతిపక్షం లాబీలో పార్టీ ఎంఎల్‌ఎలతో సమావేశం అయ్యారు. రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలలో ఒక స్థానాన్ని కాంగ్రెస్ సులభంగా దక్కించుకోగలదు.

తన ఆరు సంవత్సరాల సభ్యత్వ కాలపరిమితిని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏప్రిల్‌లో ముగించుకున్నప్పుడు ఆ సీటు ఖాళీ అవుతుంది. లోక్‌సభలో ఐదు పర్యాయాలు ఎంపిగా ఉన్న తరువాత ఎగువ సభకు సోనియా గాంధీ ఎన్నిక అవుతుండడం ఇదే ప్రథమం. లోక్‌సభలో రాయ బరేలికి ప్రాతినిధ్యం వహించిన 77 ఏళ్ల సోనియా గాంధీ తదుపరి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె మొదటి సారిగా 1999లో ఎంపిగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవిని తిరస్కరించిన సోనియా గాంధీజీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయగలనన్న ప్రకటనను మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం’ అని గెహ్లాట్ అంతకుముందు ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఆమె ప్రకటన మొత్తం రాష్ట్రానికి సంతోషకరం.

ఈ ప్రకటనతో పాత జ్ఞాపకాలన్నీ పునరావృతం అవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. 15 రాష్ట్రాల నుంచి 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో రిటైర్ అవుతున్నారు. ఆ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల దాఖలుకు గడువు గురువారం ముగుస్తుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తరువాత రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న గాంధీ కుటుంబం రెండవ సభ్యురాలు సోనియా గాంధీ.

ఇందిరా గాంధీ 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు తనకు చివరివని సోనియా గాంధీ ఆ ఏడాది ప్రకటించారు. ఈ పర్యాయం సోనియా తప్పుకొనడంతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వధేరా రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయగలరని ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తేలికగా గెలిచే అవకాశం ఉన్న తెలంగాణ, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రం నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. సోనియా తీసుకున్న ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మొదటి కుటుంబం హిందీ ప్రాబల్య ప్రాంతాన్ని వదులుకోవడం లేదనే సంకేతాన్ని వదిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News