Sunday, January 5, 2025

వారు ఎప్పటికీ భారత రత్నాలే: సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లు నాడు, నేడు ఎప్పటికీ భారత రత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని, ప్రతి భారతీయుడు వారిని గౌరవిస్తాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. భారత రత్నాల ప్రకటన.. ముఖ్యంగా పివికి ఇవ్వడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీస్పందిస్తూ..ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. శుక్రవారం పార్లమెంటు భవనం వెలుపల విలేఖరులతో మాట్లాడిన ఆమె‘ నేను వాటిని స్వాగతిస్తున్నాను.ఎందుకు స్వాగతించను’ అని స్పందించారు. కాగా డాక్టర్ స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా రైతులకు ‘కనీస మద్దతు ధర’ కల్పించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు.

ప్రధాని మొండి వైఖరి వల్ల ఉద్యమ సమయంలో 700 మంది రైతులు అమరులయ్యారని, కేంద్రప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పుడుకూడా అన్నదాతలు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ‘ ఎక్స్’ వేదికగా జైరాం రమేశ్ విమర్శించారు. రైతులకు న్యాయం చేయడం భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రధాన లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, ఇదే చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని జైరాం రమేశ్ అన్నారు. పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు భారత రత్న ఇవ్వడాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు.

దేశ నిర్మాణంలో పివి నరసింహారావు అద్భుతమైన సేవలందించారని, ఆయన ప్రభుత్వంలో భారత్ పలు ఆర్థిక సంస్కరణలతో ఒక సమూలమైన మార్పుతో కూడిన ప్రయాణాన్ని సాగించిందని, ఆ సంస్కరణలు రాబోయే తరాల మధ్య తరగతిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని ఖర్గే అన్నారు. ప్రధాని చరణ్ సింగ్, డాక్టర్ స్వామినాథన్‌లు అన్నదాతలు, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం ఎనలేని సేవలందించారని కూడా ఖర్గే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News