Sunday, December 22, 2024

ప్రత్యేక సమావేశాల్లో ఈ ‘తొమ్మిది’ ఉండాలి.. ప్రధానికి సోనియా లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎలాంటి ఎజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించారు.

ఈ సమావేశాల ఎజెండా ఏంటో మాకెవరికీ కనీస అవగాహన లేదు. మొత్తం ఐదు రోజుల పాటు ప్రభుత్వ ఎజెండాకే కేటాయించినట్టు మాకు తెలిసింది. అయితే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని మేం కోరుతున్నాం. ” అని సోనియా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర పభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యాణా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని ప్రధాని మోడీని కోరారు.

ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి లోని పలు భాగస్వామ్య పక్షాల నేతలు మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ , డీఎంకే, ఎన్సీపీ, సీపిఎం, సిపిఐ , ఆప్, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. ‘మోడీ చాలీసా కోసం మేము పార్లమెంటుకు వెళ్లం. సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ తెలిపారు.

సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేకం వెనుక ఆంతర్యం ఏంటనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూపీసి) అమలు, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్ల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News