Monday, January 20, 2025

నేడు బెంగళూరుకు సోనియా..విపక్షాల ఐక్యతకు కొత్త ఊపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అది 2004 సంవత్సరం జనవరి 1వ తేదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన 10 జన్‌పథ్ నివాసం నుంచి కాలినడకన అక్కడకు కొద్ది దూరంలోనే ఉన్న లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ నివాసానికి చేరుకున్నారు. ఆమె కొద్దిపాటి కాలనడక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యుపిఎ) ఆవిర్భావానికి అంకురార్ఫణ చేసింది. కొద్ది నెలల్లో వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో యుపిఎ ఘనవిజయం సాధించి వరుసగా పదేళ్లు..రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగింది. అటు పిమ్మట..నరేంద్ర మోడీ నాయక్తవంలో అధికారంలోకి వచ్చిన బిజెపి తన మిత్రులను, ప్యత్యర్థులతో జతకట్టి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. క్రమంగా కాంగ్రెస్ ప్రభ జాతీయ రాజకీయాలలో క్షీణించసాగింది.

ఈ పరిస్థితులలో రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించడమే లక్షంగా ప్రతిపక్షాలన్నీ సంఘితం కావాలన్న లక్షంతో జరుగుతున్న ప్రయత్నాలకు బెంగళూరు సోమవారం వేదిక కానున్నది. జులై 17, 18 తేదీలలో బెంగళూరులో జరగనున్న మలివిడత ప్రతిపక్షాల ఐక్య సమావేశాలకు కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరుకానుండం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొననున్న ఈ సమావేశాలలో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుపై ఒక విస్పష్టమైన హామీ కాంగ్రెస్ నుంచి లభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యుపిఎచైర్‌పర్సన్‌గా దశాబ్దం పాటు కొనసాగిన సోనియా గాంధీ మిత్రపక్షాల నుంచి రాజకీయ విశ్వసనీయతను, చిత్తశుద్ధిని నిరూపించుకున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రతిపక్షాల ఐక్య సమావేశాలకు ఆమె ప్రత్యక్ష హాజరు నూతనోత్సహం తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయనిపక్షంలో బెంగళూరు సమావేశానికి తాము రాబోమంటూ ఆప్ అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఆదివారం విస్పష్ట ప్రకటన చేసింది. దీంతో బెంగళూరు సమావేశాలకు రానున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించడం ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాలలో తొలి విజయసూచనలుగా రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాలన్న కాంగ్రెస్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని కూడా వారు చెబుతున్నారు.

సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తుందని పరిశీలకులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలలో వరుసగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, ఆప్, జెఎంఎం, శివసేన-ఎన్‌సిపి, జెడి(యు)-ఆర్‌జెడి కూటమి బలమైన పక్షాలుగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ పార్టీలకు అధిక ప్రాధాన్యతను వదిలిపెట్టవలసి ఉంటుందని వారు సూచిస్తున్నారు. అదే విధంగా పంజాబ్, కేరళ రాష్ట్రాలలో ఆప్, వామపక్షాలు ప్రధాన పక్షాలుగా అధికారంలో ఉన్నాయి. సోమవారం రాత్రి జరగనున్న విందు సమావేశంలో కాంగ్రెస్ తరఫున విస్పష్టమైన హామీ సోనియా గాంధీ నుంచి లభించే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే..కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో తమకు ఏ రకమైన ప్రాధాన్యం కల్పించనున్నదో కూడా ఆ పార్టీ భరోసా ఇవ్వాలని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. కాగా..త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆ రాష్టాలలో తమకు ఎంతమేరకు ప్రాధాన్యం లభిస్తుందో అన్న సందేహం కూడా ప్రతిపక్షాలను పట్టిపీడిస్తోంది. వీటన్నిటికీ సోనిగా గాంధీ నుంచి తమకు స్పష్టమైన సందేశం లభించగలదని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు భావిస్తున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిఎస్‌పి వంటి ఎటూ తేల్చేకోలేని పరిస్థితుల్లో ఉన్న పార్టీలకు ఒక దిశానిర్దేశం చేయగలవని కూడా రాజకీయ పరిశీలకుల అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News