తెలంగాణ ప్రజలకు ఆ విషయం తెలుసు
ఎపిలో కాంగ్రెస్ సమాధి అవుతున్నా వెనక్కి తగ్గలేదు
ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలుచేస్తాం
మోడీ పాలనలో ధరలపై అదుపులేదు.. ఉద్యోగాల భర్తీలేదు
సంగారెడ్డి విజయభేరి యాత్రలో ఎఐసిసి చీఫ్ ఖర్గే
మన తెలంగాణ బ్యూరో/ హైదరాబాద్: సోనియాగాంధీ మాట ఇస్తే తప్పరని ఈ విషయం మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నా రు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో (కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో) భాగంగా ఆయన మాట్లాడుతూ సో నియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సమాధి అవుతున్నా వెనక్కి తగ్గలేదని, తన మాటను నిలబెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పి లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తామని, స్వయంగా ఆయనే దగ్గరుండి కర్ణాటకలో అమలవుతున్న ఐదు గ్యారంటీల లబ్ధిదారులతో మాట్లాడిస్తారని ఖర్గే స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపి గా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బిహెచ్‌ఈఎల్, బిడిఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని, ఆ కుటుంబం మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చుతారన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. పేదల సంక్షేమమే ఎజెండాగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అ మలు చేస్తున్నట్లుగానే తెలంగాణలోనూ వెంటనే సాకారమవుతాయన్నారు. ఇవి ఓట్ల కోసం ఇస్తున్న హామీలు కావని, పేదల బతుకుల బాగు కోసం ఇస్తున్న గ్యారంటీలన్నారు. మోడీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయిందని ఖర్గే ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆయన మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ గొప్పగా చెప్పుకున్నారని ఖర్గే విమర్శించారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిత్యావసరాల ధరలు తగ్గుతాయని ఆయన వివరించారు.