రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు ఈ పదవికి ముందు వరసలో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ అధ్యక్ష పదవికి తాను తప్పకుండా పోటీ చేస్తానని, తన స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం అశోక్ గెహ్లాట్ ఆయనను కలిశారు. పార్టీ అధ్యక్ష పదవికి తమ కుటుంబం దూరంగా ఉంటుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు గెహ్లాట్ శుక్రవారం విలేఖరులతో చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి చేపట్టాలని వస్తున్న విజ్ఞప్తులను అంగీకరించాలని ఆయనను(రాహుల్ గాంధీని) నేను ఎన్నో సార్లు కోరాను. అయితే గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండరాదని తాను నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు’ అని గెహ్లాట్ చెప్పారు. ‘వాళ్లంతా నేను కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. వారి ఆకాంక్షను నేను గౌరవిస్తాను.
అయితే కొన్ని కారణాల వల్ల గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా అని రాహుల్‌జీ నాతో చెప్పారు’ అని గెహ్లాట్ చెప్పారు. 20 ఏళ్ల తర్వాత తొలి సారి గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో గెహ్లాట్ అధ్యక్ష పదవిని చేపట్టాలని గాంధీ కుటుంబం కోరుకుంటున్న విషయం తెలిసిందే.. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వేరే వాళ్లకు ముఖ్యంగా తన ప్రత్యర్థి సచిన్ పైలెట్‌కు వదిలిపెట్టడానికి ఆయనకు సుతరామూ ఇష్ట లేదు. రెండేళ్ల క్రితం సచిన్ పైలట్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసి దాదాపుగా ఆయన ప్రభుత్వాన్ని కూల్చేంతపని చేసిన విషయం తెలిసిందే. తాను రెండు పదవుల్లో కొనసాగుతానని గెహ్లాట్ రాహుల్‌కు చెప్పినప్పటికీ ఆయన దాన్ని తోసిపుచ్చారు. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని ఉదయ్‌పూర్‌లో జరిగిన పార్టీ సదస్సులో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దాన్నిపాటిస్తారని నేను ఆశిస్తున్నా’ అని రాహుల్ గాంధీ గురువారం విలేఖరులతో అన్నారు.
రాహుల్ గాంధీ తన అభిస్రాయాన్ని స్పష్టం చేసిన తర్వాత గెహ్లాట్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ అథ్యక్షుడిగా ఎన్నికైన పక్షంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అజయ్ మాకెన్, సోనియాగాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ సోమవారం నామినేషన్ వేస్తారని భావిస్తున్నారు. అధ్యక్ష పదవికి తాను పోటీ చేయాలని అనుకొంటున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన పార్టీ ఎంపి శశిథరూర్ అందుకు సోనియాగాంధీ అనుమతి కూడా తీసుకున్న విషయం తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి మనీశ్ తివారీ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఈ పదవికి పోటీ పడే అవకాశముందని వార్తలు రావడం తెలిసిందే.నామినేషన్లు దాఖలకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.
నేను పోటీ చేయను: దిగ్విజయ్
కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టత ఇచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పక పాటిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అశోక్ గెహ్లాట్, శశిథరూర్‌లు పోటీ చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు.