Thursday, January 23, 2025

ఆస్తి కోసం పంచాయితీ

- Advertisement -
- Advertisement -

తండ్రి చనిపోయి మూడు రోజులైంది. అంత్యక్రియలు చేయాల్సిన కొడుకులు ఆస్తి కోసం గొడవకు దిగారు. ఆ ‘పంచాయితీ’ తెగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని మొండికేశారు. అప్పటికే 12 ఎకరాలు పంచుకున్న కొడుకులు ఎకరం భూమి కోసం కొట్లాటకు దిగడంతో చావుకు వచ్చిన బంధువులు, తోబుట్టువులు, గ్రామస్థులంతా ఈ తతంగాన్ని చూసి ఈసడించుకున్నారు. అయినా ఆ కొడుకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామ పంచాయతీ సిబ్బందితో దహన సంస్కారాలు చేయిస్తామని హెచ్చరించగా గ్రామ పెద్దలు ఒప్పంద కాగితం రాయడంతో ఎట్టకేలకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. ఈ దారుణ ఘటన యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం, సదర్శాపురం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలకుంట్ల బాలయ్య, లింగమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు నరేశ్, సురేశ్, ఇద్దరు కుమార్తెలు శోభ, సోని.

ఈ నలుగురికి పెళ్లిళ్లు చేశారు. పక్షవాతంతో మంచాన పడ్డ బాలయ్య (65) గురువారం చనిపోయాడు. కుమార్తెలు, అల్లుళ్లు, బంధువులంతా అంత్యక్రియల కోసం వచ్చారు. ఈ క్రమంలో ఎకరం భూమి ‘పంచాయితీ’ తెరమీదకు వచ్చింది. మృతుడి భార్య లింగమ్మ, ఆమె అన్న రాములు కలిసి సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, తాటిపాముల గ్రామంలో మూడెకరాల భూమి కొన్నారు. అందులో అర ఎకరం భూమిని ఇద్దరు కలిసి అమ్ముకోగా, మిగతా భూమిలో చెల్లెలు లింగమ్మ పేరున పట్టా చేయాల్సిన ఎకరం 10 గుంటల భూమిని అన్న రాములు తన కూతురు లింగమ్మ, పెద్ద కోడలు (పెద్ద కొడుకు నరేశ్ భార్య అరుణ) పేరున పట్టా చేశాడు. దీంతో చిన్నకొడుకు సురేశ్ ఆ భూమిలో తనకు కూడా వాటా వస్తుందని, దానిని పంచాలని పట్టుబట్టడంతో అన్నదమ్ములిద్దరి మధ్య ‘పంచాయితీ’ మొదలైంది. దీంతో అంత్యక్రియలు చేయకుండా మూడు రోజులుగా తండ్రి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఇంటి ముందు ఉంచారు. నెల రోజుల క్రితమే అన్నదమ్ములిద్దరు కలిసి తండ్రి సంపాదించిన 12 ఎకరాల భూమిని బాలయ్యను వాహనంలో తీసుకెళ్లి మరీ తమ ఇద్దరి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఎకరం భూమి కోసం మళ్లీ ఇప్పుడు ఆ ఇద్దరు కొడుకులు కొట్లాడుకోవడం, భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య లింగమ్మ నిస్సహాయంగా ఉండిపోయి భర్త మృతదేహం వద్ద మూడు రోజులుగా కూర్చుని ఏడుస్తోంది. దహన సంస్కారాలు అయిపోయాక భూమి ‘పంచాయితీ’ మాట్లాడుదామని తోబుట్టువులు, బంధువులు నచ్చజెప్పినా..అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఊళ్లో ఉంచడం ఊరికి, మీ కుటుంబానికి మంచిది కాదని గ్రామ పెద్దలు చెప్పినా ససేమిరా అంటూ అన్నదమ్ములిద్దరూ మొండికేశారు. ఇద్దరు కొడుకుల బాగోతాన్ని చూసిన బంధువులు, గ్రామస్థులంతా ఈసడించుకున్నారు. చావుకు వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు మూడు రోజులుగా తిండికి, చలితో ఇబ్బంది పడ్డారు. విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, మోత్కూరు ఎస్‌ఐ నాగరాజుతో పాటు మోత్కూరు, అడ్డగూడూరు పోలీసులు శనివారం గ్రామానికి వెళ్లి ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. సిఐ, ఎస్‌ఐ మృతుడి ఇద్దరు కొడుకులతోపాటు కోడళ్లతో మాట్లాడి అంత్యక్రియలు చేయాలని, లేనిపక్షంలో పంచాయతీ సిబ్బందితో చేయిస్తామని హెచ్చరించారు.

పోలీసులు గ్రామ పెద్దలతో మాట్లాడి రాములు తన కూతురు అరుణ (లింగమ్మ పెద్ద కోడలు) పేరున చేసిన ఎకరం భూమిని లింగమ్మ పేరున పట్టా చేసేలా పెద్ద మనుషులు ఒప్పంద కాగితం రాయడంతో ‘పంచాయితీ’ సద్ద్దుమణిగింది. ఎట్టకేలకు శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తి కోసం మూడు రోజులుగా తండ్రి అంత్యక్రియలు చేయకపోవడం పట్ల బంధువులు, గ్రామస్థులు బాలయ్య కొడుకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News