ముంబై: వెండి తెరపై ప్రతి నాయకుని పాత్రలు పోషించే సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం తాను రియల్ హీరోనని అనేక సార్లు నిరూపించుకున్నారు. తాజాగా..దుబాయ్ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి ఆయన తన మానవత హృదయాన్ని మరోమారు చాటుకున్నారు. ఇటీవల సోనూ సూద్ దుబాయ్ నుంచి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద క్యూలైన్‌లో సోను నిలుచుని ఉండగా ఆయన ముందు నిలుచున్న ఒక మధ్యవయస్కుడు హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు.
వెంటనే ఆయనను పట్టుకున్న సోను ఆయన తలను తన ఒడిలో పెట్టుకుని కార్డియో పల్మనరీ రిస్ససిటేషన్(సిపిఆర్) చేయడం ప్రారంభించారు. కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. సోనూ సూద్ చూపిన చొరవపట్ల అక్కడున్న సహ ప్రయాణికులతోపాటు ఇమిగ్రేషన్ అధికారులు కూడా అభినందనలు తెలియచేశారు. తన ప్రాణాలు కాపాడిన సోనూ సూద్‌కు ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలియచేశాడు. కొవిడ్ సమయంలో వందలాది మంది వలస కార్మికులకు సోనూ సూద్ సహాయం అందచేసిన విషయం తెలిసిందే. రోగులకు మందులు, ఇతర పరికరాలు అందచేసి ఆయన దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు అందుకున్నారు.