Thursday, January 23, 2025

ఆశ్రమ పాఠశాలలో భర్తీకి త్వరలో నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -
సిఆర్‌టి సంఘం కృతజ్ఞత సభలో మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : త్వరలో ఆశ్రమ పాఠశాలల్లో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలపారు. డైట్ చార్జీలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్ బంజారా భవన్ లో తెలంగాణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సంఘం(సిఆర్‌టి) కృతజ్ఞతసభ నిర్వహించింది. ఈ సభకు గిరిజన మ హిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా జరయ్యారు. సిఆర్‌టిల గౌరవ వేతనం పెంచడంతోపాటు 10 నెలలు మాత్రమే వచ్చే జీతాలను 12 నెలలకు పెంచి వేతనాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, అందుకు కృషి చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ లకు సిఆర్‌టి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు అండగా నిలిచారన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, మారుమూల ప్రాంతాలైన కొండలు, గుట్టలు, వాగులు దాటి కుటుంబానికి దూరంగా ఉంటూ చాలీ చాలని వేతనాలతో గత ప్రభుత్వాల వైఫల్యంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వీరి సేవలు వాడుకుని ఒకే రకమైన జీతం రూ. 5500 లతో వెట్టిచాకిరి చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మూడుసార్లు సిఆర్‌టిల జీతాలు పెంచి గౌరవ వేతనాలు అందిస్తున్నారన్నారు.

రూ. 22,290 ఉన్న జీతాన్ని 30 శాతం పిఆర్‌సితో రూ. 28,977 లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు. సిఆర్‌టిల నియామకంతో ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి ఫలితాలు 93 శాతం నుండి 95శాతానికి పెరిగాయని తెలిపారు, సి ఆర్ టి ల రెగ్యులరైజ్ కు కృషి చేస్తానని మంత్రి సత్యవతి హామినిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ భద్రత లేక మిగిలిపోయారని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్‌టిల జీతాలు పెంచడంతో పాటు, సిఎల్స్ మంజూరు చేయడం, 10 నెలలకు మాత్రమే వచ్చే వేతనాలను 12 నెలల అందించడం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులు, ఆశ వర్కర్లు, ప్రతి ఉద్యోగి కి గౌరవ వేతనం అందిస్తున్నారన్నారు. కోవిడ్ సమయంలో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం వాట 80 శాతం ఉంటే రాష్ట్రం వాటా 20 శాతం ఉండేదని, కెసిఆర్ పాలనలో కేంద్రం వాట 20 శాతం ఉంటే రాష్ట్ర వాటా 80 శాతంగా ఉందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అంగన్‌వాడీలకు పిఆర్‌సి అమలు చేశారని. దీనిని స్వరాష్ట్ర ఉద్యోగులతో పాటు ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఆశ్రమ పాఠశాలలో 70 నుంచి 80 మంది విద్యార్థులు ఉంటే కెసిఆర్ పాలనలో ఇప్పుడు 1,30,000 మంది విద్యార్థులు సకల సౌకర్యాలతో విద్యనుభ్యసిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్మన్ లు, కోవలక్ష్మి, రాథోడ్ జనార్ధన్, శాసన సభ్యురాలు భానోత్ హరీ ప్రియ, మాజీ ఎంపి గోడం నగేష్, బిఆర్‌ఎస్ నాయకులు గుగులోత్ శ్రీరామ్ నాయక్, సిఆర్‌టి యూనియన్ అధ్యక్షులు మాలోతు సోమేశ్వర్, ట్రైబల్ జెఎసి చైర్మన్ లింగాల శ్రీరాములు, స్టేట్ కోఆర్డినేటర్ భూక్య తిరుపతి, రవీందర్, బాలాజీ, లక్ష్మణ్ ,శ్రీనివాస్ హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News